కొత్త రైతులకు టెన్షన్ లేదిక..!
– పాసు పుస్తకం డిజిటల్ కాపీ పొందే చాన్స్
– ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం
– పాసుబుక్ రాని రైతులకు చాలా ఉపయోగం
– ఎలా, ఎక్కడ చేసుకోవాలంటే..?
దర్శిని డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కొందరు రైతులకు పాసు పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా భూములు కొనుగోలు చేసిన రైతులకు, కొత్తగా భూ మార్పిడి చేసుకున్న రైతులకు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు చేసుకునే వీలు లేక ఆందోళన చెందుతున్నారు.

అయితె ప్రభుత్వం నుంచి పట్టాదారు పాసుపుస్తకం భౌతికంగా అందనప్పటికీ.. ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని అవసరాలకు చెల్లుబాటయ్యే డిజిటల్ కాపీని పొందే వీలుందని అధికారులు సూచిస్తున్నారు.
చెల్లుబాటు అధికారికం
భూభారతి-2025 (ఆర్వోఆర్) చట్టంలోని సెక్షన్-10, సబ్ సెక్షన్-6 ప్రకారం ఈ డిజిటల్ కాపీకి అధికారికంగా చెల్లుబాటు ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉన్న డిజిటల్ పాసుపుస్తకం కాపీని డౌన్లోడ్ చేసుకుని అధికారిక కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చని సిసిఎల్ఏ కార్యదర్శి మంద మకరంద్ స్పష్టం చేశారు. పాసుపుస్తకాల కాపీలను అడిగే అన్ని ప్రభుత్వ శాఖలు ఈ డిజిటల్ పత్రాన్ని ఆమోదిస్తాయని.. దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

డిజిటల్ కాపీని ఎలా పొందాలంటే…?
డిజిటల్ పాసుపుస్తకం కాపీని పొందడానికి, మొదట ఆన్లైన్లో భూభారతి పోర్టల్లోకి వెళ్లి, ‘ల్యాండ్ డిటేల్స్ సెర్చ్’పై క్లిక్ చేయాలి. అక్కడ ‘పట్టాదారు పాసుపుస్తకం నంబరు’ ఐచ్ఛికాన్ని ఎంచుకుని, ఆ నంబరును నమోదు చేయాలి. పక్కనే కనిపించే ఐచ్ఛికంలో ఆధార్ నంబరులోని మొదటి నాలుగు అంకెలను నమోదు చేసి, దిగువన ఉన్న క్యాప్చా (Captcha)ను పూరించాలి. ఈ వివరాలను నమోదు చేసిన వెంటనే, డిజిటల్ పాసుపుస్తకం, ఆర్వోఆర్ పహాణీ రెండూ తెరుచుకుంటాయి. తరువాత ప్రింట్ తీసుకోవడమే ఇక.

భూమి వివరాలు తెలుసుకోవడానికి
భూమి వివరాలను తెలుసుకోవాలనుకుంటే భూభారతి పోర్టల్లోని ‘ల్యాండ్ డిటేల్స్ సెర్చ్’లోకి వెళ్లి, ‘సర్వే నంబరు/సబ్ డివిజన్ నంబరు’ను క్లిక్ చేసి, జిల్లా, మండలం, గ్రామం పేరు నమోదు చేయాలి. ఆ వెంటనే, సర్వే నంబరు/సబ్ డివిజన్ నంబరు నమోదు చేసే ఐచ్ఛికం వస్తుంది. అందులో సర్వే నంబరును నమోదు చేస్తే, పక్కనే ఖాతా నంబరు అడుగుతూ మరో ఐచ్ఛికం కనిపిస్తుంది. దానిని నింపి, కింద ఉన్న ఆంగ్ల అక్షరాలు/అంకెలను ‘ఎంటర్ క్యాప్చా’ గడిలో నమోదు చేసి, ఆకుపచ్చ రంగులో ఉన్న ‘ఫెచ్’ (Fetch) అనే చోట క్లిక్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి.
అంతేకాకుండా, మీసేవ కేంద్రాల ద్వారా కూడా ఈ సేవలను పొందే అవకాశం ఉంది.

ఇదికూడా చదవండి…

