ఇందిరమ్మ ఇళ్లకు రూల్ చేంజ్..!
– పట్టణ లబ్దిదారులకు భారీ ఊరట
– నిర్మాణంలో దానికి అనుమతి సడలింపు
– నిర్ణయం తీసుకున్న సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో ఓ నిబంధనను సడలిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి భారీ ఊరట లభించనుంది.

దీంతో పాటు ఇళ్ల నిర్మాణంలో వేగం పుంజుకునే అవకాశం కలుగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కింద పట్టణ ప్రాంతాల లబ్ధిదారులకు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇంటి స్థలం నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం లేదా ఇరుకుగా ఉండటం వల్ల చాలా మంది లబ్ధిదారులు నిర్మాణం చేపట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, ప్రభుత్వం తాజాగా పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు జీ+1 (గ్రౌండ్ ఫ్లోర్ + మొదటి ఫ్లోర్) నిర్మాణానికి అనుమతి ఇస్తూ నిబంధనలను సడలించింది. ఇక నుంచి లబ్ధిదారుడి ఇంటి స్థలం చిన్నగా ఉన్నా లేదా నిబంధనల మేరకు లేకపోయినా వారు నిలువుగా రెండు అంతస్తుల వరకు ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతి లభిస్తుంది.

కొత్తగా సడలించిన జీ+1 నిబంధనల వల్ల బల్దియాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ పురోగతి లభించడానికి ఆస్కారం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం జీ+1 నిర్మాణాలకు అనుమతించిందనే వార్త తెలుసుకున్న పట్టణ పేదలు తమ సొంతింటి కల నెరవేరుతుందన్న గంపెడాశతో ఉన్నారు. అయితే ఈ సడలింపు నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత రావాల్సి ఉంది.
కొత్తగా దరఖాస్తులు స్వీకరించి, ఈ సడలించిన నిబంధనల ప్రకారం అర్హత కల్పిస్తుందా? లేక, గతంలో స్థల నిబంధనల కారణంగా తిరస్కరించబడిన పాత దరఖాస్తులకు తిరిగి అనుమతులు మంజూరు చేస్తుందా? అనే విషయంపై త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉంది. ఈ నిబంధనల సడలింపు ప్రధాన నగరాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగవంతం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

