ఈడీ అస్త్రానికి లొంగే ప్రసక్తే లేదు

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఈడీ అస్త్రానికి లొంగే ప్రసక్తే లేదు
– నన్ను దోషిగా నిలబెట్టాలన్నదే లక్ష్యం
– ఎన్ని కుట్రలు చేసిన బీజేపీ ఆటలు సాగవ్‌
– మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: ఎన్ని కుట్రలు చేసినా.. ఈడీ నోటీసుల అస్త్రాన్ని ప్రయోగించినా బీజేపీకి లొంగే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తేల్చి చెప్పారు. తనను దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలన్నదే బీజేపీ కొత్త కుట్ర అని.. దానిని కూడ భగ్నం చేసి తీరుతామని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో పైలెట్ రోహిత్ రెడ్డి మీడీయాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్రలో ఎక్కడా కూడా డబ్బు అనే మాట లేదు, మనీలాండరింగ్‌ జరగలేదని వెల్లడించారు. ఏదో విధంగా ఈడీని పంపించి నన్ను ఇబ్బంది పెట్టి, భయబ్రాంతులకు గురి చేసి.. లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. నన్ను, నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈడీని ప్రయోగించారని ఆరోపించారు. ఎమ్మెల్యేల ఎర కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న నన్ను పిలిచి విచారించారు. ఏ కేసులో అయినా నిందితులను ముందుగా విచారించడం సాధారణమని, కానీ ఈ కేసులో మాత్రం అందుకు విరుద్ధంగా ఫిర్యాదుదారుడిని పిలిచి విచారించడం విడ్డూరంగా ఉందన్నారు. రెండు రోజులుగా తనతో పాటు అభిషేక్‌ను పిలిచి విచారించినా.. వాళ్లు అనుకున్నది అనుకున్నట్టు ఏదీ జరగలేదన్నారు. దీంతో ఈడీ కొత్త రూటును ఎంచుకుని ఎర కేసులో ముఖ్య సూత్రధారి అయిన నందకుమార్‌ని విచారించేందుకు యోచిస్తుందన్నారు. నందకుమార్‌తో వారికి అనుకూలంగా స్టేట్‌ మెంట్‌ తీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామలన్నినా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఆ వాంగ్మూలంతో నన్ను ఈ కేసులో ఇరికించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నా కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసినా.. వ్యక్తిగత ఇమేజ్‌ని దెబ్బతియాలని చూసినా.. నేను మాత్రం తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టినా ఎక్కడా వారికి ఎదురు దెబ్బ తినని కేంద్రానికి తెలంగాణలో అనుకున్నది ఒకటి.. అయిందొకటి కావడంతో ఓర్వలేక అనేక కుట్రలు పన్నుతున్నారు. బీజేపీ చేస్తున్న కొత్త కుట్రను భగ్నం చేస్తామన్నారు. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉందని.. ఈ విషయంపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయబోతున్నామన్నారు. ఈనెల 27న జరిగే ఈడీ విచారణకు కూడ హాజరవుతానని తెలిపారు.