బీసీ స్మశాన వాటిక కోసం కదలిన కందుకూరి..!
– సొంత డబ్బులతో పారిశుద్ధ్య పనులు
– జేసీబీ యంత్రంతో ముళ్ల పొదలు, చెత్త తొలగింపు
– కలెక్టర్ నుంచి కమీషనర్ దాకా స్పందన కరువుతో ముందడుగు
– తాండూరు ఎమ్మెల్యే చొరవకై ఎదురుచూపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డులోని బీసీ స్మశాన వాటిక కోసం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ కదిలారు. గత దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక బీసీ స్మశాన వాటికలో ముళ్ళ పొదలు, చుట్టుపక్కల వారు వేసే చెత్తతో దుర్గంధంగా మారింది. గత ఆరు సంవత్సరాలుపైగా స్మశాన వాటిక అభివృద్ధి కోసం కందుకూరి రాజ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్ల వరకు అనేకమార్లు వినతి పత్రాలు సమర్పించినా అభివృద్ధికి నోచుకోలేదు. స్మశాన వాటిక అభివృద్ధికి నిధులు కేటాయించినా నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోలేదు.
రాజ్ కుమార్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు, మున్సిపల్ కార్యాలయాల ముట్టడిలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీసీ నేత రాజ్ కుమార్ తన సొంత డబ్బులతో బీసీ స్మశాన వాటికలో ఏర్పడిన ముళ్ల పొదలు పేరుకపోయినా చెత్తాచెదారాన్ని తీసివేయాలని సంకల్పించారు. ఈమేరకు గురువారం ఉదయం జెసిబి యంత్రంతో పనులు మొదలుపెట్టారు. స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని, నిధులు కేటాయించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఇటీవలే విన్నవించారు. ఇందుకు ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే సహకారంతో బిసి స్మశాన వాటిక అభివృద్ధి చెందుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. మరోవైపు బీసీ స్మశాన వాటిలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన రాజ్ కుమార్‌ను పలువురు అభినందించారు.
ఇదికూడా చదవండి…

