బ్యాంకులో కుంభకోణం..!
– ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు స్కెచ్
– ఫోర్జరీలో స్వాహా చేసిన ఉద్యోగులు
– ఎలా చేశారో తెలిస్తే షాక్
– పోలీసులు ఏమన్నారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎంతో నమ్మకంతో బ్యాంకులో దాచుకున్న డబ్బులకు రక్షణ కరవైపోతోంది. ఎవ్వరు.. ఏ విధంగా దాచుకున్న డబ్బులను దోచుకుంటారో అర్థం కావడంలేదు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జరిగిన కుంభకోణం బ్యాంకు ఖాతాదారులను కలవరపెడుతోంది. బ్యాంకులో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులే స్కెచ్‌లు వేసి బీనామీ పేర్లతో డబ్బులను లూటీ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తాండూరు పట్టణం శాంతినగర్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు కొనసాగుతోంది. గతంలో ఈ బ్యాంకులు గొల్కోండ బ్యాంకులుగా, దక్కన్ గ్రామీణ బ్యాంకుల పేరుతో నిర్వహణలో ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తరువాత ఈ బ్యాంకులను తెలంగాణ గ్రామీణ బ్యాంకులుగా మార్చారు. చాలా ఏండ్ల క్రితం గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులే ఈ బ్యాంకులో మేజర్ ఖాతాదారులు. 1994కు ముందు ఈ బ్యాంకుల్లో ఖాతా కలిగిన రైతులు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే అన్ని బ్యాంకులకన్నా అధిక వడ్డీ శాతం అమల్లో ఉండేదని బ్యాంకు అధికారుల సమాచారం. అప్పట్లో చాలా మంది రైతులు ఈ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకున్నారు. ప్రస్తుతం అవి లక్షలుగా మారాయి. వీటిపై బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులు స్వాహా చేసేందుకు పథకం వేశారు.

ఎలా చేశారంటే…
1994లో బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన ఖాతాలను అప్పట్లో కంప్యూటీకరణ చేయలేదు. మ్యాన్‌వల్ పత్రాల్లో ఖాతాదారులకు అందజేశారు. ఫిక్స్‌డ్ చేసిన డబ్బులు, వడ్డీరేట్లను అందులోనే పొందుపరిచేవారు. ఈ పాత బాండ్లపై ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను కాజేసేందుకు అదే బ్యాంకులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు స్కెచ్ వేశారు. రైతుల పేరుపై ఉన్న బాండ్‌లకు సీరియల్ నెంబర్ ఆధారంగా బీనామి రైతులను సృష్టించారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి.. ఆపై వారి ఖాతాల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ములను కాజేసినట్లు తెలిసింది.

ఎలా దొరికిపోయారంటే…?
చాలా ఏళ్ల క్రితం ఇదే బ్యాంకులో ఓ రైతు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ. 4లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఇటీవల ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులను తీసుకునేందుకు ఆ రైతు కుటుంబం బ్యాంకుకు వచ్చింది. మేనేజర్ బ్యాంకు ఖాతాలను పరిశీలించి ఇంతకుముందే డబ్బులను డ్రా చేసుకున్నారు.. కదా.. మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అన్ని పత్రాలతో ఫిర్యాదు చేయగా ఈ కుంభకోణం బయటకు వచ్చింది. వెంటనే బ్యాంకు అధికారులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో పనిచేస్తున్న ప్రేమ్ సింగ్, అరవింద్‌లపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.

ఇదికూడా చదవండి…

