‘ఇందిరమ్మ’కు పునాదులు..!
– తాండూరు పట్టణంలో జోరుగా ఇళ్ల నిర్మాణాలు
– మున్సిపల్‌లో ఉత్సహాం చూపుతున్న లబ్దిదారులు
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ప్రయోజనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల సొంతింటి కళను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లకు తాండూరు పట్టణంలో పునాదులు పడ్డాయి. పథకానికి అర్హులుగా ఎంపికైన లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాలకు ఉత్సహాం చూపుతున్నారు. ప్రభుత్వం ద్వారా సాయాన్ని అందిపుచ్చుకుని ఇళ్ల నిర్మాణం కోసం ముందడుగు వేశారు.

తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవలో మంజూరు చేసిన ఇళ్లతో పేదలకు ఎంతో లబ్దిచేకూరుతోంది. తాండూరు పట్టణంలో 36 వార్డులలో సుమారు 80వేలకు పైగా నివాసాలు ఉన్నాయి. ఇందులో చాలా మంది పేదలు సొంత ఇళ్లు లేక అవస్థతలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా సొంతింటి నిర్మాణానికి రూ. 5లక్షల సాయం అందిస్తామని ప్రకటించింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి లబ్దిదారులను ఎంపిక చేయించారు.

నిజమైన పేదలకు ఇందిరమ్మ పథకం అమలు చేయాలని.. ఆలస్యమైనా కూడా అర్హులను గుర్తించేందుకు కృషి చేశారు. ఈ మేరకు తాండూరు పట్టణంలోని 36వార్డులకు కలిపి మొదటి విడతలో 158 మంది లబ్దిదారులను గుర్తించారు. కొన్ని రోజుల క్రితమే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రోసిడింగ్‌లను పంపిణీ చేశారు.
వడి వడిగా నిర్మాణాలు
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ప్రోసిడింగ్ అందుకున్న లబ్దిదారులు నిర్మాణ పనులను వేగవంతం చేశారు. వారికి చెందిన సొంత స్థలాల్లో ఇందిరమ్మ నిర్మాణాల కోసం ముగ్గులు వేసుకుని పనులు ప్రారంభించారు. పట్టణంలోని సుమారు 6 వార్డులను మినహాయించి.. మిగతా 30 వార్డుల్లో కనిష్టంగా 1 నుంచి గరిష్టంగా 17మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు.

ఆయా వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముగ్గులు చేసుకున్న లబ్దిదారులు పనులు ప్రారంభించారు. సుమారు 60 మంది ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టేశారు. కొన్ని వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల పునాదులు సిద్దమై బిల్లుల మంజూరుకు ఎదురుచూస్తున్నారు.
ప్రయోజనాలు ఇలా
లబ్దిదారులు తమ సొంతింటి కలను నిజం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సహాకారం అందిస్తోంది. లబ్దిదారులకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షల ఆర్థిక సాయాన్ని వివిధ దశలలో మంజూరు చేస్తోంది. ఈ ఆర్థిక సాయం పేదలకు ఎంతో ఉపయోగపడుతోంది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక తక్కువ ధరకే పొందవచ్చు. 400గజాల లోపు స్థలం ఉన్న లబ్దిదారులు జీప్లస్ 1 నిర్మాణాలు చేసుకునేందుకు నిబంధనలు అమలు చేస్తోంది. జీప్లస్ వన్ పద్ధతిలో నిర్మించే ఇంటికి రూ.5 లక్షల సాయాన్ని 4 విడతల్లో అందజేయనున్నారు. దిగువ అంతస్తు పైకప్పు పూర్తయ్యాక రూ.లక్ష, మొదటి అంతస్తులో కాలమ్స్ పూర్తయ్యాక రూ.లక్ష, పైఅంతస్తు పైకప్పు, 2 అంతస్తుల గోడలు పూర్తయ్యాక రూ.2లక్షలు, పూర్తి నిర్మా ణం అయ్యాక మిగతా రూ. లక్ష విడుదల చేయనున్నారు.

ఇదికూడా చదవండి…

