తెలంగాణ సర్కారు షాక్..!

క్రైం తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

తెలంగాణ సర్కారు షాక్..!
– సీబీఐకీ ఎమ్మెల్యేలకు ఎర కేసు బదిలీ
– ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు
హైదరాబాద్, దర్శని ప్రతినిధి : ఎమ్మెల్యేలకు ఎరకేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారంటూ భారాస ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సింహయాజీ, రామచంద్రభారతి, నందకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో తెలంగాణ సర్కారుకు షాక్ తగిలింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భాజపా, నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తుపట్ల నమ్మకం లేదని భాజపా, నిందితులు దాఖలు పిటిషన్‌లను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. అయితే, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది. సిట్‌ దర్యాప్తుపై నమ్మకం లేదంటూ భాజపా, నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా కేసును సీబీఐకి అప్పగించింది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, వాంగ్మూలాలను సీబీఐకి అప్పగించాలని సిట్‌ను ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సైతం హైకోర్టు రద్దు చేసింది.