‘హస్తం’లో అనిశ్చితి..!
– పదవుల పంపకాల్లో తర్జన భర్జన
– సీనియర్లు, జూనియర్ల పోటాపోటీ
– ఎవరు భంగపడినా స్థానికంపై ప్రభావం..?
– అధికార పార్టీ పరిస్థితిపై రాజకీయ నేతల విశ్లేషణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. పార్టీలో పదవుల పంపకాల విషయంలో తర్జన భర్జన జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. సరిగ్గా స్థానిక ఎన్నికల ముందు పదవుల పందేరం అధికార పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంపై నేతలు పలు విధాలుగా విశ్లేషణలు చేస్తున్నారు.

గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కార్యక్రమాలను చేపడుతోంది. గ్రామం, పట్టణం, వార్డు నుంచి క్షేత్రస్థాయిలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పల్లెల నుంచి పట్టణం వరకు పార్టీలోని డివిజన్, మండల, గ్రామం, బ్లాక్ స్థాయి పదవులతో పాటు నామినేటేడ్ పదవులను భర్తి చేసేందుకు దృష్టిసారించింది. ఇందులో భాగంగా పదవులు ఆశిస్తున్న నేతల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర స్థాయి పదవులు, నామినేటేడ్ పదవులు, అధ్యక్ష పదవుల కసం దరఖాస్తులు స్వీకరించింది. అయితే పదవుల భర్తిలో హస్త రాజకీయాలు చేపట్టినట్లు అంతర్గత విమర్శలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీల నుంచి పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పదవుల భర్తిలో సీనీయర్లు, జూనియర్ల అంటూ తెరపైకి వర్గాలు రావడంతో పార్టీలో అనిశ్చితి ఏర్పడానికి కారణంగా తెలుస్తోంది.

తర్జన భర్జన
తాండూరు నియోజకవర్గంలో పార్టీ పదవుల పంపకాల విషయంలో నేతలు తర్జన భర్జన పడుతున్నారు. కష్టపడిన వారికే పదవులు ఇవ్వాలని.. 80 శాతం పదవులు సీనీయర్లకు, 20 శాతం మాత్రమే కొత్త వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించడంతో సంద్గితత ఏర్పడింది. నియోజకవర్గంలో తాండూరు మండలం, తాండూరు పట్టణంలోని అధ్యక్ష పదవుల భర్తిలో నేతల మద్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండల అధ్యక్ష పదవికి కరణ్ కోట్ మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, ప్రస్తుత అధ్యక్షులు జన్నె నాగప్పలు పోటీ పడుతుండగా ఇద్దరిలో ఒకరిని ఒప్పించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. ఇక తాండూరు పట్టణానికి వస్తే ప్రస్తుత అధ్యక్షులు హబీబ్ లాల, ఓ యువనాయకుడు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలు పోటీలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. ఇక్కడ కూడా పదవుల విషయంలో రాజీ కుదిరే అకాశం ఉందని అనుకుంటున్నారు. పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల్లో సీనీయర్, జూనియర్ నేతల తీవ్ర పోటీ ఉండడంతో ఎవరికి పదవులు ఇవ్వాలో అనే విషయం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.
స్థానిక ఎన్నికలపై ప్రభావం..?
కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణాలు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, తాండూరు మండలాల్లో నేతల మద్య అంతర్గత విభేదాలు జరుగుతున్నాయని అందరికి కనిపిస్తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించినట్లుగా గుర్తుచేస్తున్నారు. పార్టీలో పదవుల విషయంలో జూనియర్ నేతలకు భంగపాటు కలిగిస్తే పరిణాలు తారుమారు కావచ్చనే సంకేతాలను వినిపిస్తున్నారు. అదే జరిగితే స్థానిక ఎన్నికలలో తీవ్ర ప్రభావం కనిపించడం ఖాయమని రాజకీయ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

