ప్ర‌ధానే పాల‌మూరుకు శ‌త్రువు

జాతీయం తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ప్ర‌ధానే పాల‌మూరుకు శ‌త్రువు
– కేంద్రం నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఆల‌స్యం
– ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు పారిస్తా
– తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్
– బ‌హిరంగ స‌భ‌లో వికారాబాద్ జిల్లా వాసుల‌కు హామి
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడి వైఖ‌రితోనే తెలంగాణ వాసుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ విమ‌ర్శించారు. మంగ‌ళ‌వారం వికారాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏర్పాటు చేసిన‌ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వ వైఖ‌రిపై ధ్వ‌జ‌మెత్తారు. పాల‌మూరు ప్రాజెక్టుపై ప్రధాని న‌రేంద్ర‌మోడికి 8 ఏండ్లుగా కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చాల‌ని దాదాపు 100 దరఖాస్తులు ఇచ్చినా ప‌ట్టించుకోలేద‌న్నారు. ఎన్ని నీళ్లు ఇస్తారో చెప్తే అలా ప్రాజెక్టు కట్టుకుంటామని చెప్పడం జ‌రిగింద‌న్నారు. కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు పెట్టి తిర‌కాసు పెడుతూ తెలంగాణకు ప్రధాన మంత్రే మనకు శత్రువుగా మారాడ‌న్నారు. దీనిపై బీజేపీ నేతలకు దమ్ముంటే.. ఢిల్లీ పోయి కేంద్ర ప్రభుత్వం దద్దమ్మతనం వల్ల పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్ర‌శ్నించాల‌న్నారు. అంతేకానీ కేసీఆర్ బస్సు ముందు జెండాలు పట్టుకొని ఊపడం కాదు. అక్కడకెళ్తే నోళ్లు రావు. లాగులు తడిచిపోతాయని ఎద్దేవా చేశారు. అయినా భయప‌డాల్సిన ప‌నిలేద‌ని, ప్రాజెక్టు ఎలాగైనా పూర్తిచేసి నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొస్తానని, రైతుల పొలాల్లో కృష్ణానది నీళ్లు పారించి చూపిస్తాన‌ని హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మ‌హేశ్వ‌ర్ రెడ్డి, కాలే యాద‌య్య‌, పైల‌ట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సుర‌భి వాణిదేవి, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.