రాజీడ్రామాకు తెర..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రాజీడ్రామాకు తెర..!
– హస్తంతో మళ్లీ ధారాసింగ్ చెలిమి
– బుజ్జగింపులతో వెనక్కితగ్గినట్లు ప్రకటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: నాలుగు రోజుల క్రితం పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామ చేసినట్లు వ్యవహారానికి తెరపడింది. పార్టీ నేతల వ్యవహార శైలితో పార్టీని వీడుతున్నట్లు అప్పట్లో ప్రకటన చేసి.. అదే పార్టీ నేతల బుజ్జగింపులతో వెనక్కి తగ్గినట్లు తాజాగా ప్రకటించడంతో రాజీనామా డ్రామ ముగిసింది. శనివారం తాండూరు పట్టణంలోని సిండికేట్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు రమేష్ మహారాజ్ తో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రమేష్‌ మహరాజ్ పక్కనే ధారాసింగ్ కూర్చుని మీడియాతో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. పీసీసీ డెలిగేట్ పదవి నుంచి తప్పించడంతో అలకతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను పార్టీ నాయకులకు అందించారు. అయితే పార్టీ పెద్దలు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్‌ రెడ్డి, బోసురాజు తదితరులు పిలుపు మేరకు వెనక్కి తగ్గడం జరిగిందని ధారా సింగ్ తెలిపారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఐదు రోజుల పాటు ఆయన రాజీనామా డ్రామ మహ రక్తికట్టించిందని రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.