పెరుగుతో రోగ నిరోధక శక్తి మెరుగు
– అన్ని సీజన్లో అందరూ తీసుకోవచ్చు
– పలు వ్యాధుల నుంచి రక్షణ
దర్శిని డెస్క్: చలికాలంలో అందరూ సహజంగానే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా చర్మం, జుట్టు విషయంలో.. రోగ నిరోధక శక్తిని పెంచుకునే విషయంలో జాగ్రత్తలను పాటిస్తుంటారు. ఇక ఈ సీజన్‌లో కొన్ని ఆహార పదార్థాలకు మనం దూరంగా ఉండాలి. చల్లనివి, శరీరానికి చలువ చేసేవి అసలు తినరాదు. అయితే శరీరానికి చలువ చేసే ఆహారాల్లో పెరుగు ఒకటి. మరి పెరుగును ఈ సీజన్‌లో తినవచ్చా.. అని చాలా మందికి సందేహం కలుగుతుంటుంది. పెరుగును అన్నికాలలో తప్పకుండా తీసుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
పెరుగు ప్రొబయోటిక్ ఆహారాల జాబితాకు చెందుతుంది. కనుక దీన్ని తింటే శరీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. చెడు బాక్టీరియా నాశనం అవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కనుక ఈ సీజన్‌లో మనకు వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే పెరుగు ప్రొ బయోటిక్ ఆహారం కనుక జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, మలబద్దకం, కడుపులో మంట వంటివి తగ్గుతాయి. చలికాలంలో మలబద్దకం సమస్య వస్తుంది కాబట్టి పెరుగు తింటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
పెరుగులో ఉండే క్యాల్షియం కొవ్వును తగ్గించి స్లిమ్‌గా ఉండేలా చేస్తుంది. హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో అధికంగా ఉండే ప్రొటీన్‌ల వలన శరీరానికి మంచి పోషణ అందుతుంది. పెరుగును తీసుకుంటే స్నాక్స్ కూడా తక్కువగా తినాలనిపిస్తుందని చెబుతున్నారు.
చిరుతిండ్లు తినడం వల్ల శరీరంలో క్రొవ్వు బాగా పెరుగుతుంది. ఊబకాయం, పొట్ట వస్తుంది. కాబట్టి రోజూ డైట్‌లో పెరుగు చేర్చుకుంటే చాలా మంచిది. 300 గ్రాముల పెరుగులో 200 గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్యాల్షియం కడుపులోని కొవ్వును బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది.

