బ్రేకులు ఫేయిలై ఆర్టీసీ బస్సు బొల్తా
– ఓ మహిళ మృతి..?
– ప్రయాణికులకు గాయాలు
– అనంతగిరి ఘాట్ వద్ద ప్రమాదం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: బ్రేకులు ఫేయిల్ అయి ఆర్టీసీ బస్సు బొల్తా కొట్టింది. ఈ సంఘటన ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్ర సమీపంలోని అనంగిరి కొండల వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వికారాబాద్ నుంచి ధారూర్‌లో జరిగే క్రిస్టియన్ మెథడిస్ట్ జాతరకు 72 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని ఘాట్ రోడ్డు వద్దకు రాగానే బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపుతప్పింది. వెంటనే ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనలో మహిళ మృతి చెందినట్లు సమాచారం. గాయాల పాలైన బాధితులను చికిత్స నిమిత్తం వికారాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆర్టీసీ బస్సు బొల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. బాధితులను పరామర్శించి.. ప్రమాదం గురించి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని వైద్యులకు సూచించారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సు బొల్తా.. బాధితుల ఆరోగ్య పరిస్థితులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

