ఇదేక్కడి ఎగనామం..!
– ఒకే వ్యక్తిపై 38 బ్యాంకు ఖాతాలు
– బాధితుడికి తెలియకుండానే అకౌంట్లు
– బ్యాంకులో రూ. 1.24లక్షల అప్పుకూడ
– వికారాబాద్ జిల్లాలో వెలుగులోకి ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: చాలా మంది బ్యాంకులలో అకౌంట్లు తెరిచి రుణాలు తీసుకుని ఆ బ్యాంకులకు ఎగనామం పెడుతుంటారు. ఎవరో చేసిన మోసానికి సామాన్యులు బలైపోతుంటారు. ఇలాంటి సంఘటనే ఓ సామాన్యుడికి ఎదురైంది. గుర్తుతెలియని వ్యక్తులు అతనికి తెలియకుండానే పాన్, రేషన్ కార్డులతో 38 ఆన్‌లైన్ బ్యాంకు అకౌంట్లు తెరిచారు. ఓ బ్యాంకులో రూ. 1.24లక్షల అప్పుకూడ పెట్టారు. అప్పుకావాలని బ్యాంకు కోసం వెళ్లిన సామాన్యుడికి ఈ విషయం తెలిసి బిత్తర పోయాడు. పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్దేముల్‌కు చెందిన మంగలి అనంతయ్య ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టేందుకు అప్పుకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. .ఈ క్రమంలోనే వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకును ఆశ్రయించారు. వారు అనంతయ్య ఆధార్, పాన్ కార్డుల ద్వారా వివరాలు సేకరించారు. వికారాబాద్‌లోని కెనరా బ్యాంకులో ద్విచక్ర వాహనం కోసం రూ.1.24 లక్షల అప్పు తీసుకున్నట్లు తేలింది. దీనికితోడు అతని పేరిట 38 ఆన్‌లైన్ బ్యాంకు ఖాతాలు ఉన్నాయని తెలిపారు. దాంతో బిత్తరపోయిన బాధితుడు కెనరా బ్యాంకు అధికారులను ఆశ్రయించి వివరాలు అడిగారు. నవాబుపేట మండలం పులుమద్ది గ్రామానికి చెందిన మంగలి అనంతయ్య అనే పేరున్న మరో వ్యక్తి అప్పు తీసుకున్నట్లు గుర్తించారు. ఇద్దరి పేర్లు ఒకటే అయినా తండ్రుల పేర్లు మాత్రం వేరు. రూ.1.24 లక్షల అప్పు తీసుకున్న వ్యక్తి తండ్రి బక్కయ్య. బ్యాంకులో పెద్దేముల్ అనంతయ్యకు చెందిన పాన్, రేషన్‌కార్డులు, పులుమద్ది అనంతయ్యకు చెందిన ఆధార్, ఓటరు కార్డులు ఉన్నాయి. అంతేకాదు గుర్తుతెలియని వ్యక్తులు పెద్దేముల్ అనంతయ్య పేరిట 38 ఆన్‌లైన్ ఖాతాలను తెరిచి 26 ఖాతాలను మూసేశారు. 12 మాత్రం కొనసాగుతున్నాయి. తీవ్ర ఆందోళనకు గురైన పెద్దేముల్ అనంతయ్య, ఆయన భార్య శ్యామల ఇద్దరూ సోమవారం ఎస్సై అన్వేష్‌రెడ్డికి తమ సమస్య విన్నవించారు. ఫిర్యాదు తీసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

