పాలకవర్గం కొలువు దీరేప్పుడో..!
– ఎమ్మెల్యే ప్రకటన కోసం ఎదురు చూపులు
– చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులపై అయోమయం
తాండూరు, దర్శిని ప్రతినిధి: రైతులకు సేవలందించడం వ్యవసాయ మార్కెట్ కమిటీల పాత్ర కీలకం. ప్రస్తుతం రైతుల పంటల కొనుగోళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గం ఖాళీగా దర్శనమిస్తోంది. తాండూరు మార్కెట్ కమిటి పాలకవర్గం పదవి కాలం గత నెలలో పూర్తయ్యింది. ఈ పాలకవర్గం పదవి కాలం పూర్తవబోతుందని దానికి ముందుగానే కొత్త చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ఎంపికపై వ్యూహాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ముఖ్య అనుచరులగా ఉన్న శ్రీనివాస్ చారికి చైర్మన్ పదవి ఇస్తారని అందరూ ఊహించారు. కాని మార్కెట్ కమిటి చైర్మన్ స్థానం ఓసీ మహిళకు రిజర్వ్ కావడంలో అభిప్రాయాలు మారిపోయాయి. ఆ తరువాత చైర్మన్ స్థానాన్ని పొందేందుకు కొందరు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ క్రమంలోనే మున్సిపల్ కౌన్సిలర్ విజయాదేవి పేరు తెరపైకి వచ్చింది. కౌన్సిలర్‌గా కొనసాగుతుండగా ఆ పదవికి రాజీనామా చేయించి నామినేటెట్ హోదాలో ఆమెకు మార్కెట్ కమిటి చైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్ణయించారు. వైస్ చైర్మన్ స్థానాన్ని తాండూరు మండలానికి చెందిన యువనాయకులు పటేల్ ఉమాశంకర్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నాల్లోనే ఉండగానే మునుగోడు ఉప ఎన్నికల కారణంగా వాయిదా పడింది. మునుగోడు ఉప ఎన్నిక తరువాత ఎమ్మెల్యే ఎర వ్యవహారంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కీలకంగా మారడంతో మళ్లీ వాయిదా పడింది. ప్రస్తుతం సమయం ఉన్నా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్ణయానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరగా పాలకవర్గం ఏర్పాటైతే రైతులకు సేవలు అందుతాయని రైతులు ఆశిస్తున్నారు.

