హైదరాబాద్‌లో కనిపించి..!

టెక్నాలజీ తాండూరు తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

హైదరాబాద్‌లో కనిపించి..!
– వికారాబాద్‌ పొలాల్లో కంపించి
– నేలపై పడిన వింత మిషన్‌పై క్లారిటీ
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలో ఆందోళనకు గురి చేసిన వింత మిషన్‌పై మెల్లిగా స్పష్టత వస్తోంది. మర్పల్లి మండలంలోని మొగిలిగుండ్ల గ్రామంలో బుధవారం ఉదయం సమీప పంట పొలాల్లో వింత మిషన్ నేలజారిన విషయం తెలిసిందే. ఆకాశంలో ఎగిరిన ఈ వింత మిషన్ అంతకుముందు సరిగ్గా ఉదయం 7-30 గంటలకు హైదరాబాద్‌ ప్రాంతంలో ఎగిరినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. హైదరాబాద్‌లో కనిపించిన వింత మిషన్‌ వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో కంపించి నేలకరిచింది. హైదరాబాద్‌లో ఆకాశంలో ఎగురుతున్న వింత వస్తువును చూసి హైదరాబాద్ పౌరులు ఆశ్చర్యపోయి వీడియోలు కూడ తీశారు. ఆ తర్వాత వింత మిషన్‌ వికారాబాద్‌ జిల్లా ముర్ప్లిలో ప్రత్యక్షమయ్యింది. ముందుగా నేలపై పడిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు భారీ ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని ఆశ్యర్యానికి గురయ్యారు. వింతగా కనిపించిన మిషన్‌ను ఆసక్తిగా తిలకించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. రైతులు, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. పర్యావరణ నివేదికను క్షేత్రస్థాయిలోని నిపుణులకు పంపించామని.. అందులోని సైంటిఫిక్ వస్తువులు, కెమెరాలను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరోవైపు నేలపై పడిపోయిన వింత మిషన్‌పై ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఎందుకు కిందపడిందో అనే దానిపై కూడ క్లారిటీ ఇచ్చారు. నేషనల్ బెలూన్ ఫెసిలిటీ ప్రయోగించిన రీసెర్చ్ బెలూన్ అని.. ప్రధానంగా పర్యావరణ అధ్యయనాల కోసం ప్రయోగించడం జరిగిందన్నారు. వాతావరణ పరిశోధన కోసం ఈ మిషన్‌ల ద్వారా ఆకాశంలో ఎత్తులలో ఒత్తిడి, ఉష్ణోగ్రత, తేమతో పాటు గాలి వేగంలో మార్పులను కొలవడానికి సహాయపడతాయని వివరించారు. అంతేకాకుండా వాతావరణ సూచనలో సహాయపడే వాతావరణ సౌండింగ్ గ్రాఫ్‌లను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ప్రయోగాల విషయమై గత నెల అనుమతులు నోటీసు కూడా జారీ చేయబడిందని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో రికార్డు అయిన దృశ్యాలు కింద వీడియోలో చూడవచ్చు