కంటైనర్‌తోనే ఇళ్లు కట్టేశాడు..!
– రూ. 3లక్షలు, 10 రోజుల శ్రమ అంతే
– రైతు తెలివిని మెచ్చుకుంటున్న ప్రజలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: కొన్ని సందర్భాలలో తెలివి ఉంటే ఏదైనా సాధించవచ్చని చాలా మంది నిరూపించారు. ఓ రైతు తన అవసరం కోసం తన తెలివిని ఉపయోగించి దానిని నిజం చేసుకున్నాడు. ప్రస్తుత కాలంలో గది కట్టడానికే కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఇక ఓ నలుగురు నివాసం ఉండే ఇళ్లు కట్టాలన్నా కనీసం ఆరు నెలల నుండి సంవత్సరం పైనే పడుతుంది. కానీ ఆ రైతు ఓ కంటైనర్‌తో పొలంలో ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే కేవలం రూ. 3లక్షలు పెట్టుబడి, 10 రోజుల శ్రమతోనే దీనిని ఏర్పాటు చేసుకోవడం విశేషం. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంజిల్లా చిలుకూరులో కూడలి ఏటిఒడ్డున కోదాడకు చెందిన నాగేశ్వరరావు 15 ఎకరాల వ్యవసాయభూమి కొన్నాడు. అందులో ఫామ్ ఆయిల్ మొక్కాలు వేశాడు. పొలం చూసేందుకు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. వచ్చినప్పుడల్లా ఎక్కడుండాలి అనే ఆలోచనలో పడ్డ నాగేశ్వరరావు తక్కువ ఖర్చుతో సౌకర్యంగా ఉండేలా ఆలోచించి, గుంటూరులో రెండున్నర లక్షలతో తయారుచేసిన ఓ కంటైనర్ తెప్పించాడు. 50వేల ఖర్చుతో పొలంలో పిల్లర్లు వేసి, కంటైనర్‌ను బిగించాడు. దాంతో ఈ ఇంటి నిర్మాణం కేవలం 10 రోజుల్లోనే పూర్తయింది. కంటైనర్‌లో బెడ్‌రూమ్, అటాచ్ బాత్రూం, వంటగది ఉన్నాయి. ఓ చిన్న ఫ్యామిలీ సౌకర్యవంతంగా జీవించేలా ఉన్న ఈ ఇంటిని అటువైపు నుంచి వెళ్లే వారంతా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ చిన్న ఇల్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

