మహిళలకు తెలంగాణ సర్కారు కానుక
– వారి ఆరోగ్య సమస్యలపై కొత్త స్కీమ్
– అందబాటులోకి 8 రకాల వైద్య సేవలు
– కొత్త పథకం గురించి మీరు తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు సర్కారు కానుక అందించబోతోంది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తెలంగాణ ప్రభుత్వం “ఆరోగ్య మహిళ” కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళలకు బహుమతిగా ఈ హెల్త్ స్కీమ్ తీసుకొస్తుంది. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందించబోతుంది. మహిళలు ప్రధానంగా ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్యలపై వైద్యారోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవలు ప్రవేశ పెట్టనున్నారు మొత్తం 1200 పీహెచ్ సి, యూపిహెచ్‌సీ, బస్తి దావాఖనా కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తున్నారు. ఇందుకోసం సీఎం సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది.
అన్నీ ఉచితం.. అందుబాటులోకి వైద్య సేవలు
తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా మహిళలకు 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. సమస్యలు ఉన్నవారిని రెఫరల్ సెంటర్లు, ప్రభుత్వ పెద్దాసుపత్రులకు పంపుతారు. సంబంధిత మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు అందించే కార్యక్రమం ఉంటుంది. రిఫరల్ ఆసుపత్రుల్లో మహిళలకు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఉంటాయి. ఈ ప్రత్యేక సేవల గురించి మహిళా సంఘాలు, మెప్మా వారికి అవగాహన కల్పించనున్నారు. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు. మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో అవగాహన కలిగిస్తారు. నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు. సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు. ఈ పరీక్షలు అన్నీ ఉచితంగానే చేస్తారు. ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్ ఉంటుంది.

