టెన్త్ ఎగ్జామ్ టెన్షన్..!
– వాట్సాప్స్‌లో పది క్వషన్ పేపర్ ప్రత్యక్షం
– ప్రభుత్వ పాఠశాల సెంటర్‌లో టీచర్ నిర్వాకం
– అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు, అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరులో జరిగిన టెన్త్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ పెట్టింది. తాండూరులోని ఓ పరీక్షా కేంద్రంలో పరీక్షా ప్రారంభమైన కొద్ది సేపటికే క్వషన్ పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. దీంతో సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే సోమవారం తాండూరులోని 10 పరీక్షా కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.
సరిగ్గా 9-05 గంటలకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. 9-30 గంటలకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత 9-37 నిమిషాల కే పదో తరగతి మొదటి పరీక్ష తెలుగుకు సంబంధించిన క్వషన్ పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షం కావడంతో వైరల్ గా మారింది.
వెంటనే పోలీసులు, ఎంఈఓలు ఆరా తీయగా పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేసిన పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాల నుంచి బందెప్ప అనే ఉపాధ్యాయుడు ఫోన్ ద్వారా వాట్సాప్‌లోకి వచ్చినట్లు గుర్తించారు. అదే పాఠశాలలో బందెప్ప సైన్స్ టీచర్ గా పనిచేస్తుండగా తొలిరోజు నిర్వహించిన పరీక్షకు ఆయనను రిలీవర్‌గా నియమించారు.
దాదాపు 3 గంటల విచారణ
విషయం తెలుసుకున్న పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఎంఈఓ వెంకటయ్య గౌడ్ లు వెంటనే పాఠశాలకు చేరుకుని వాట్సాప్ లో క్వషన్ పేపర్‌ను పంపిన బందెయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు. అనంతరం తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు సమక్షంలో విచారణ జరిపారు. ఈ విచారణలో బందెయ్య ఫోన్ నుంచే క్వషన్ పేపర్ బయటకు ప్రత్యక్షమైనట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు, అధికారులు దాదాపు 3 గంటల పాటు విచారణ జరిపారు.
ఎలా ప్రత్యక్షమయ్యిందంటే.
పదో తరగతి పరీక్ష క్వషన్ పేపర్ ఎలా ప్రత్యక్షమయ్యిందనే దానిపై ఎంఈఓ వెంకటయ్య గౌడ్ వివరణ ఇచ్చారు. నిజానికి పరీక్ష కేంద్రాలకు సెల్ ఫోన్లు అనుమతించలేదని తెలిపారు. కాని బందెయ్య సెల్ ఫోన్ తెచ్చినా పరీక్ష పర్యవేక్షణ అధికారికి ఇవ్వలేదన్నారు. ఈ పరీక్ష కేంద్రంలో మొత్తం 260 మంది హాజరు కావాల్సి ఉండగా 258 మంది పరీక్షలు రాశారని తెలిపారు. గైర్హాజరు అయిన విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నా పత్రం తీసుకుని వాట్సాల్లో పంపడం జరిగిందని, దీంతో ప్రశ్నాపత్రం బయటకు ప్రత్యక్షమయ్యిందన్నారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఈఓ రేణుకా దేవిలకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. మరోవైపు పోలీసులు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సమక్షంలో టీచర్ బందెప్పను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. పరీక్షా కేంద్రం ఇంచార్జ్, అధికారులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని సీఐ రాజేందర్ రెడ్డి వెల్లడించారు.
టీచర్‌పై గతంలో పోక్సో కేసు
మరోవైపు పదోతరగతి తెలుగు ప్రశ్నాపత్రంను వాట్సాప్‌లో ఉంచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్పపై కొద్ది మాసాల క్రితం పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆయన పనిచేస్తున్న పాఠశాలలో ఒక విద్యార్థినిని వేధించడంతో కేసు నమోదు చేశారు. తాజాగా బందెప్ప పదో తరగతి ప్రశ్నాపత్రంను వాట్సాప్‌లో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు.

