సీఈఐఆర్‌ డబుల్ తీన్మార్..!

క్రైం టెక్నాలజీ వికారాబాద్

సీఈఐఆర్‌ డబుల్ తీన్మార్..!
– 6 సెల్‌ ఫోన్‌లను గుర్తించిన పోలీసులు
– జిల్లా ఎస్పీ కోటిరెడ్డి చేతల మీదుగా అందజేత
– సంతోషం వ్యక్తం చేసిన వినియోగదారులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: పోయిన సెల్‌ ఫోన్‌లను పట్టిస్తున్న నూతన టెక్నాలజీ సీఈఐఆర్ పోర్టల్‌ వికారాబాద్‌ జిల్లాలో డబుల్‌ తీన్మార్‌ కొట్టింది. వివిధ సమయాల్లో ఫోన్‌లను కోల్పోయిన 6 మంది వినియోగదారులకు ఒకే రోజు ఫోన్లను అందజేశారు. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని దోమ పోలీస్టేషన్‌ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బందయ్య, ప్రవీణ్ రెడ్డి, రమేశ్, మహేశ్ కుమార్, గోవర్ధన్, రమేశ్ లు వివిధ కారణాలతో తమ సెల్ ఫోన్ లను పోగొట్టుకున్నారు. దీంతో దోమ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్టేషన్‌ ఎస్‌ఐ విశ్వజన్ తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన సీఈఐఆర్ పోర్టల్‌(www.ceir.gov.in)లో లాగిన్ అయి అప్లోడ్ చేశారు. జిల్లా ఐటి కోర్ టీమ్ అధికారులను సంప్రదించి, వారి సహాకారంతో తక్కువ సమయంలో బాధితులు పోగొట్టుకొన్న 6 మొబైల్ ఫోన్ లను గుర్తించి స్వాదినం చేసుకున్నారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి చేతుల మీదుగా వినియోగదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తమ సెల్ఫోన్ దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్నట్లయితే www.ceir.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని సూచించారు. ఈ వ్యవస్థతో పోగొట్టుకున్న లేదా చోరీ అయిన మొబైల్స్ ను పట్టుకోవడం జరుగుతుందని అన్నారు. కావున ప్రజలు ఈ CEIR అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. మరోవైపు వినియోగదారులు రమేష్‌, ప్రవీణ్ రెడ్డిలు మాట్లాడుతూ పోలీస్ అధికారులు కొత్తగా రూపొంధించిన CEIR వెబ్సైట్ ద్వారా సెల్ ఫోన్ ఆచూకీ కనుగొని ఇప్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో పాటు దోమ ఎస్‌ఐ, ఐటి కోర్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.