ముందుగానే మద్యం టెండర్లు..!
– రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
– కొత్త మద్యం విధానం ఎలా ఉంటుందంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ముందుగానే మద్యం టెండర్లను ఆహ్వానించేందుకు సిద్దమైంది. పాత మద్యం విధానం గడువు ఇంకా మూడు నెలలు ఉండగానే ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి 2025 నవంబరు 30 వరకు (రెండేళ్లపాటు) ఈ విధానం అమలులో ఉండనుంది. గతంలో మాదిరిగానే 2011 జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజుల్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ లెక్కన ఈనెల ఆగస్టులోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించడం గమనార్హం. అంటే రేపటి నుంచి 21వ తేదీలోగా దుకాణదారుల్ని ఎంపిక చేయనున్నారు. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి మద్యం విక్రయాలు ప్రారంభించాల్సి ఉంటుంది.
అయితే గతంలోని మద్యం విధానం మాదిరిగానే ఆరు స్లాబుల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహించనుంది. నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుంను రూ.2 లక్షలుగా నిర్ణయించింది. ఒక దరఖాస్తుదారుడు ఎన్నైనా దరఖాస్తులు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రతి దరఖాస్తుకు విధిగా రూ.2 లక్షల చొప్పున చెల్లించాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాలకు లాటరీ పద్ధతిలో దుకాణదారుల్ని ఎంపిక చేయనున్నారు. మద్యం దుకాణాదారులు ఆరు విడతల్లో లైసెన్స్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. నేడు కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలవారీగా గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించనున్నారను. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, 18న దరఖాస్తుల స్వీకరణ ముగింపు, 21న దుకాణదారుల ఎంపికకు డ్రా, 21-22 తేదీల్లో మొదటి విడత ఎక్సైజ్ ట్యాక్స్ చెల్లింపు, నవంబరు 30న దుకాణాలకు సరకు విడుదల, డిసెంబరు 1న కొత్త దుకాణాల్లో విక్రయాలు ప్రారంభంకు అవకాశం కల్పించారు. గతంలో మాదిరిగానే రాష్ట్రమంతటా దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే తెరవాలి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం రాత్రి 11 గంటల వరకు అమ్మకాలు సాగించే వెసులుబాటు కల్పించారు.
ఈ కింద విధంగా రిజర్వేషన్లు
క్రితంసారి తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజికవర్గాల వ్యాపారులకు టెండర్లలో రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం.. ఈసారీ వాటిని కొనసాగించనుంది. రిజర్వేషన్ కేటగిరీలో భాగంగా 786 మద్యం దుకాణాల్లో గౌడ సామాజికవర్గానికి 393 (15 శాతం), ఎస్సీలకు 262 (10 శాతం), ఎస్టీలకు 131 (5శాతం) కేటాయించారు.
దుకాణాల లైసెన్స్ చెల్లింపులు ఎలా ఉన్నాయంటే..
5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు: రూ.50 లక్షలు, 5,001-50,000 జనాభా ఉంటే: రూ.55 లక్షలు, 50,001-1,00,000 జనాభా ఉంటే: రూ.60 లక్షలు, 1,00,001-5,00,000 జనాభా ఉన్న ప్రాంతాలకు: రూ.65 లక్షలు, 5,00,001-20,00,000 జనాభాఉంటే: రూ.85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో: రూ.1.1 కోట్లుగా నిర్ణయించింది.
ఇది కూడా చదవండి…

