హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
– కరోనా నిబంధనలతో ఎన్నికల నిర్వహణ
– స్పష్టం చేసిన ఎన్నికల కమీషన్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమీషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చేనెల అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల, అదే నెల 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో వెల్లడింది. ఉప ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనుండగా అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 13గా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఉప ఎన్నికల పోలింగ్ తేదీ అక్టోబర్ 30 కాగా.. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ చేయాలని నిర్ణయించారు. ఇక అదే రోజున కౌంటింగ్ పూర్తి కాగానే ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్ను విడుదల చేసింది.
కరోనా నిబంధనలతో ఎన్నికల నిర్వహణ
హుజురాబాద్ ఉప ఎన్నికలను కరోనా నిబంధనలతో నిర్వహించాలని ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది. ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధిస్తూనే.. సభల్లో వెయ్యి మందికి పైగా జనం మించరాదని ఆదేశించింది.
ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఇదే..
అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల.
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8.
అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.
అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.
నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.

