పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం..!
– పట్టణంలో కొత్త డ్రైనేజీ, పైపులైన్ వ్యవస్థ
– అమృత్ 2.0 కింద ట్యాంకుల నిర్మాణం
– మిషన్ ప్రత్యామ్నాయంగా ఇంటింటికి కాగ్నా నీళ్లు
– రూ. 30 కోట్లతో చిలువ వాగు అభివృద్ధి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– బస్తీబాటలో వార్డుల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులతో పట్టణంలోని మల్ రెడ్డిపల్లి, గొల్ల చెరువు, పాత తాండూరు ప్రాంతాలలో పర్యటించారు. ఆయా వార్డుల్లో డ్రైనేజీ, పైపులైన్ సమస్యలను పరిశీలించారు. మల్ రెడ్డిపల్లిలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను ఆరా తీశారు. అనంతరం గొల్ల చెరువును సందర్శించి మురుగు నీరు కలుషితంను కూడా పరిశీలించారు. గొల్ల చెరువులో మురుగునీరు కలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. పాత తాండూరులో పలు ప్రాంతాలను పరిశీలించి డ్రైనేజీ. పైపులైన్ సమస్యలను ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో 70 ఏండ్ల కిందటి నాటి డ్రైనేజీ, పైపులైన్ వ్యవస్థ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఎక్కడా చూసిన లీకేజీలు, మరమ్మత్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనిని ప్రక్షాళన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే గొల్ల చెరువు సుందరీకరణకు రూ. 5 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులతో గొల్ల చెరువులో మురుగు నీరు కలవకుండా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అమృత్ 2.0 కింద ప్రస్తుతం 4 ట్యాంకులు నిర్మించడం జరుగుతుందని, అవసరమైతే మరో 4 ట్యాంకులు నిర్మించి ఇంటింటికి తాగునీరు అందేలా చూస్తామన్నారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో అంతరాయం కలిగితే ప్రత్యామ్నాయం కింద తాండూరు కాగ్నానది నుంచి నీరు అందించేలా దృష్టిసారిస్తున్నామన్నారు.

మిషన్, కాగ్నా నీటి సరఫరా కోసం రూ. 15 కోట్లతో కొత్త పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో రూ.30 కోట్లతో చిలువ వాగు డ్రైనేజీని అభివృద్ధి పరుస్తామన్నారు. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తామన్నారు. దాదాపు 7 కిలో మీటర్ల మేర డ్రైనేజీ నిర్మించి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. పట్టణాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, నాయకుల సహాకారంతో ముందుకు సాగుతామన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సాహు శ్రీలత, రాము, నాయకులు డా. సంపత్ కుమార్, కరణం పురుషోత్తం రావు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల సర్సింలు. మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మద్యం పంపకాల్లో తేడా..!