రైతులకు శుభవార్త..!
– సంక్రాంతి తరువాత రైతు భరోసా
– స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే యేడాది సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్‌లో జరిగే శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లిస్తామన్నారు. ఈ విషయంలో మారీచుల మాటలను విశ్వసించరాదని రైతాంగానికి సూచించారు. ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పాలమూరు జిల్లాలో జరిగిన రైతు పండుగ విజయవంతమైన నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ , జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
రైతు పండుగలో ప్రత్యక్షంగా పాల్గొన్న రైతాంగం, రాష్ట్ర వ్యాప్తంగా 568 రైతు వేదికల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది రైతులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. “సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లించేది గ్యారెంటీ. ఈ విషయంలో ఎవరినీ నమ్మకండి. రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేయడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు తుమ్మల గారు, పొంగులేటి గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించామన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో 69 వేల కోట్ల అప్పులు ఉండేవిన్నారు. సరిగ్గా పదేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ఆ అప్పుపై అసలు, మిత్తి కలిపి ప్రతి నెలా 6,500 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితి ఉందన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టి తర్వాత వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతో ఆస్తులు, అప్పులు, విద్యుత్, సాగునీటి రంగాలపై శ్వేతపత్రం విడుదల చేశాం. ఆ లెక్కల ప్రకారం 7 లక్షల కోట్ల అప్పులు తేలాయని తెలిపారు. దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా క్షీణించిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రైతు బంధు చెల్లించకుండా బకాయి పెడితే, అధికారం చేపట్టిన వెంటనే 7,625 కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. గత ప్రభుత్వం 2023 వానాకాలం చెల్లించకుండా వదిలేసిన రైతు బంధు బకాయిలు 7,625 కోట్ల రూపాయల కూడా ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే చెల్లించిందన్నారు.
రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వంటి ప్రభుత్వ వసతి గృహాల్లో సన్న బియ్యంతో అన్నం పెట్టనున్నాం తెలిపారు. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రైతాంగం అధిక వినియోగం ఉన్న సన్న రకాలను వేయాలని సూచించారు. ఇందులో రాజకీయాలు చేసే సందర్బంగా కాదు. ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉన్నదన్నారు. వ్యవసాయం దండగ కాదు. పండుగ అన్న భరోసా రైతుల్లో కల్పించాలి” అని అన్నారు.
ఇదికూడా చదవండి…

