మున్సిపల్‌లో ప్రత్యేక పాలన..?

తాండూరు రాజకీయం వికారాబాద్

మున్సిపల్‌లో ప్రత్యేక పాలన..?
– వచ్చే నెలలో ముగుస్తున్న పాలకవర్గ పదవి కాలం
– ఓటరు జాబితా, విలీన కాలనీలపై ఫోకస్‌
– వార్డులు పెరిగితే రిజర్వేషన్లపై కసరత్తు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని మున్సిపాలీటీల పాలకవర్గాల పదవీ కాలం వచ్చే నెలలో ముగుస్తోంది. ఇందులో తాండూరు మున్సిపల్‌ కూడా ఉంది. పాలకవర్గం పదవీ కాలం ముగిసిన తరువాత ప్రత్యేక పాలన వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగగా అప్పటి బీఆర్ఎస్ పార్టీ 26న పాలకవర్గ పగ్గాలు చేపట్టింది. వచ్చేనెల జనవరి 26న పాలక వర్గం పదవీ కాలం పూర్తి చేసుకోబోతోంది. అయితే మున్సిపల్ కొత్త పాలకవర్గం కోసం వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదని ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గ్రామాల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దృష్టిసారించింది. ఈ కారణంగా మున్సపల్ ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించే వరకు మున్సిపల్‌లో ప్రత్యేక పాలన అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

ఓటరు జాబితా, విలీన కాలనీలపై ఫోకస్
ప్రస్తుతం తాండూరు మున్సిపల్‌లో 36 వార్డులు, సుమారు 80వేల వరకు జనాభా ఉంది. మున్సిపల్లో కొత్త పాలకవర్గం రాకముందే ఓటరు జాబితాను సిద్దం చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు కొత్త ఓటర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. దీనితో పాటు మున్సిపల్‌లో వార్డుల సంఖ్యను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం సమీప కాలనీలను విలీనం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. యాలాల మండలం కోకట్, బషీర్‌మీయా తాండా, తాండూరు మండలం అంతారం, అంతారం తాండా, దస్తగిరిపేట్, గౌతాపూర్, చెన్‌గెష్‌పూర్, కోనాపూర్‌తో పాటు చించొల్లి రోడ్డు మార్గంలోని పలు ప్రాంతాలను విలీనం చేసి పట్టణాన్ని విస్తరించేందుకు కసరస్తున్నారు. విలీన గ్రామాలలో కూడా వార్డులను విభజించే అవకాశం ఉంది. ఇదే జరిగితే పట్టణంలో ప్రస్తుతం ఉన్న 36 వార్డులు 50 వార్డులకు పెరిగే అవకాశం ఉంది. వార్డులు పెరిగితే ఆయా వార్డుల్లో రిజర్వేష్లపై కూడా కసరత్తు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు తాండూరు మున్సిపల్‌ను గ్రేడ్ వన్ మున్సిపాల్టీగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

నేడు స్కూళ్లు, ఆఫీసులు బంద్..!