పత్తి రైతులే టార్గెట్..!
– ముందస్తు విక్రయాలకు వ్యాపారి ప్లాన్
– పెద్దేముల్‌లో రూ. 10లక్షల నకిలీ విత్తనాల సీజ్
– జిల్లా టాస్క్ ఫోర్స్ దాడులతో వెలుగులోకి
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
– వికారాబాద్ జిల్లాలో కలకలం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : పంటలు వేసే కాలంలో నకిలీ విత్తనాలు అమ్మితే.. అధికారులు పట్టుకుంటారని భావించిన ఓ నకిలీ విత్తనాల వ్యాపారి సీజన్‌కు ముందే అమ్మకాలకు సిద్దమయ్యాడు. అధికారులను, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. సదరు వ్యాపారి నుంచి వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు రూ. 10లక్షల విలువైన నకిలీ విత్తనాలను స్వాదీనం చేసుకుని.. నిందితునిపై కేసు నమోదు చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా కోనంకి గ్రామానికి చెందిన ఉప్పలపాటి వసంత్‌రావు అనేవ్యక్తి గత 15 సంవత్సరాలుగా కర్ణాటకలోని యాద్గీర్ జిల్లా గాజుర్‌కోట్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతను గత కొంతకాలంగా కర్ణాటకలోని గుర్మిట్కల్ నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి వికారాబాద్ జిల్లాలో అమాయక రైతులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పంటల సీజన్ అయిన జూన్, జూలై నెలల్లో పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుందనే ఉద్ధేశంతో ప్రభుత్వ అధికారులకు అనుమానం రాకుండా ముందుగానే నకిలీ పత్తి విత్తనాలను తీసుకొని వచ్చి అమాయక రైతులకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నాడు.
ఈ క్రమంలోనే పెద్దేముల్ వచ్చిన వసంత్ రావు అంబేడ్కర్ విగ్రహం వద్ద వసంత్ నాలుగు ప్లాస్టిక్ సంచులతో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆరాతీశారు. అతనితో పాటు ఉన్న సంచులను పరిశీలించగా వాటిలో ఎలాంటి లేబుల్స్ కాని, లాట్ నెంబర్ గాని, బ్యాచ్ నెంబర్స్ గాని , తయారుచేసిన తేది గాని,గడువు తేది గాని ఎలాంటి సమాచారం లేని పత్తి విత్తనాల ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ విత్తనాలను వ్యవసాయాధికారి పరిశీలించి నకిలీ పత్తి విత్తనాలు అని తేల్చారు. దీంతో వసంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా అతని నుంచి మొత్తం 4 నాలుగు సంచులు స్వాధీనం చేసుకోగా వాటిలో రూ.2.70,000 విలువ కల్గిన150 కేజీల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు తెలిపారు. కాగా అతను ఇచ్చిన సమాచారంతో కర్ణాటకలోని అతని ఇంటినుంచి రూ.7,20,000 లక్షల విలువ కల్గిన 4 క్వింటల్లా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 10లక్షల వరకు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. ఇతనిపై గతంలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.
కాగా జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని , రైతులు నకిలీ విత్తనాల భారీన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక పోలీసులకుగాని లేదా టాస్క్ ఫోర్స్ అధికారులకు గాని డయల్ 100కు గాని సమాచారం అందించాలని కోరారు.
ఇదికూడా చదవండి…

