ఫేక్ పోస్టులతో జాగ్రత్త..!

క్రైం జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఫేక్ పోస్టులతో జాగ్రత్త..!
– పొరపాటున చేసినా చర్యలు తప్పవు
– సోషల్ కామెంట్లపై ప్రత్యేక నిఘా
– ప్రతి ఒక్కరు ఇవి తెలుసుకోవాలి
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : సామాజిక మాద్యమాలలో భారత్‌- పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలపై చాలా మంది పోస్టులు చేస్తున్నారు. యుద్ద సమయంలో ఫేక్ పోస్టులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాపై పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎవరైనా తప్పుడు పోస్టులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కొందరు తోచినవిధంగా కామెంట్ల రూపంలో అభిప్రాయాలు వెల్లడిస్తుంటే.. అంతకుమించి డీఫ్‌ ఫేక్, ఏఐతో రూపొందించిన వీడియోలు, ఉక్రెయిన్‌- రష్యా, ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంలోని కొన్ని చిత్రాలను ప్రస్తుత పరిస్థితులకు జోడించి వైరల్‌ చేస్తున్నారు.

ఈ తరహా తప్పుడు ప్రచారం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. దేశానికి వ్యరేతికంగా కామెంట్లు చేసినా కేసులు నమోదు చేస్తున్నారు.

మూడు రోజులుగా పరీశీలన
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, ఉద్రిక్తతల్ని పెంచే పోస్టుల్ని గుర్తించేందుకు మూడు కమిషనరేట్ల సైబర్‌క్రైమ్‌ పోలీసులు, ఐటీ విభాగాలు మూడు రోజులుగా విస్తృతంగా సైబర్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ప్రత్యేకనిఘా పెడుతోంది. తాజాగా కేంద్ర హోంశాఖ ఆదేశాలతో తప్పుడు సమాచారం పోస్టు చేసిన 8 వేల ఖాతాలను నిలిపివేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌ ప్రకటించింది. తప్పుడు, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన, షేర్‌ చేసిన వారి ప్రొఫైళ్లను విశ్లేషిస్తారు. గతంలోనూ ఇదే తరహా పోస్టులుంటే.. సుమోటోగా కేసులు నమోదు చేస్తారు. కామెంట్లు చేసేముందు అప్రమత్తంగా ఉండాలని, కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తెలుసుకోండి..
దేశ భద్రత, సున్నిత సమాచారం గురించి పోస్టు, కామెంట్, షేర్‌ చేసే ముందు కచ్చితంగా నిజమేనా అని నిర్థారించుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్ట్‌చెక్‌ పేరుతో ఎప్పటికప్పుడు వాస్తవాల్ని చేరవేస్తోంది. వాటిని పరిశీలించాలి.
ప్రజల్ని భయాందోళనకు గురిచేసే అంశాలపై పోస్టులు చేయొద్దు
ఇతరులు ఎవరైనా తప్పుడు సమాచారం, దేశానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్‌ 100కు ఫిర్యాదు చేయాలి.

ఇదికూడా చదవండి…

కోట్‌పల్లి ప్రాజెక్టుకి రాజయోగం..!