దళిత రైతులకు దన్ను..!
– వారి అభివృద్ధికి బుయ్యని బావుటా
– అసైన్డ్ భూముల మహర్దశకు ఎమ్మెల్యే కృషి
– ఎస్సీ కార్పొరేషన్ నిధులతో బోర్ల మంజూరు
– మూడు మండలాల ఎంపిక పూర్తి, మరో మండలంలో సర్వే
తాండూరు, దర్శిని ప్రతినిధి : దళిత రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పలు సంక్షేమ పథకాలలో 100శాతం రాయితీ కల్పిస్తూ ఆర్థిక ప్రగతికి కృషి చేస్తోంది. ప్రభుత్వ సహాకారంతో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలోని దళితుల అభివృద్ధికి బావుటా ఎగురవేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా నిధులు సాధిస్తూ దళిత రైతులకు చెందిన అసైన్డ్ భూములకు మహర్ధశ తీసుకవచ్చేందుకు కృషి చేస్తున్నారు.

నియోజకవర్గంలో అసైన్డ్ భూముల పట్టాలు కలిగిన రైతుల భూముల్లో బోరు మోటార్లు వేయించి బీడు బారిన భూములను సాగులోకి తెచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎస్సీ కార్పోరేషన్ నిధులతో భూములను వినియోగంలోకి తీసుకవచ్చేందుకు మండలంలో ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నారు. యాలాల మండలంలోని రాస్నం గ్రామాన్ని ఇటీవలే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. కొన్ని రోజుల క్రితమే గ్రామంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా గుట్టల భూమిలో బోరు మోటార్ల డ్రిల్లింగ్ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గ్రామంలో 12 యూనిట్ల కింద 35 కుటుంబాలకు చెందిన 69ఎకరాల 27 గుంటలకు బోర్లు మంజూరు చేయించారు. రూ. 9లక్షల 57వేల 238లతో రైతులకు చెందిన భూముల్లో బోర్లు వేయిస్తున్నారు.

ఈ నిధులు కేవలం బోర్ల డ్రిల్లింగ్ కోసం ఖర్చు చేస్తున్నారు. బోర్లు వేసిన తరువాత నీళ్లు పడితే అదనంగా బిగించే మోటారు, విద్యుత్ కనెక్షన్ కోసం మళ్లీ నిధులు మంజూరు చేస్తారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు చెందిన అసైన్డ్ భూములను వినియోగంలోకి తీసుకవచ్చి వారికి దన్నుగా నిలవాలన్న లక్ష్యాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నెరవేరుస్తున్నారు.
మూడు మంలాల్లో ఎంపిక, ఆ మండలంలో ఇంకా సర్వే
ఇప్పటి వరకు యాలాల మండలంలోని రాస్నా గ్రామాన్ని మాత్రమే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని తాండూరు మండలం మొత్తం అమలు చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలతో అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ అధికంగా ఉన్న గ్రామాలే కాకుండా.. ఎస్సీలు అధికంగా ఉన్న గ్రామాలను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ మేరకు బషీరాబాద్ మండలంలో జీవన్గీ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ గ్రామంలో సుమారు 14 నుంచి 19 యూనిట్ల వరకు రైతులను గుర్తించేందుకు అవకాశం ఉంది.

అదేవిధంగా పెద్దేముల్ మండలంలో గొట్లపల్లి గ్రామాన్ని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాండూరు మండలంలో గ్రౌండ్ వాటర్ సర్వే కొనసాగుతుండడంతో గ్రామాన్ని ఎంపిక చేయలేదు. సర్వే పూర్తి అయిన తరువాత యూనిట్లు, రైతుల వివరాలను గుర్తించే అవకాశం ఉంది.
యూనిట్ల సర్దుబాటు ఇలా
ఎస్సీ కార్పోరేషన్ ద్వారా మంజూరైన నిధులతో రైతుల భూముల్లో బోరు మోటార్లు వేయిస్తున్నారు. ఒక్కో గ్రామానికి మంజూరైన యూనిట్లతో అర్హులైన రైతులకు సర్దుబాటు చేస్తున్నారు. ఒక భూమిలో వేసే బోరులో 1 ఈంచు నుంచి పడే నీళ్లను బట్టి యూనిట్లను సర్దుబాటు చేస్తున్నారు. ఒక ఈంచు పడితే ఒక రైతుకు, 2 ఈంచులు పడితే ఇద్దరు రైతులకు, 4 ఈంచులు పడితే నలుగురు రైతులకు అందించనున్నారు.

ఇదికూడా చదవండి…

