ఆడపిల్లను కంటోందని ఘోరం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆడపిల్లను కంటోందని ఘోరం..!
– నిండు గర్భిణిని హత్య చేసిన భర్త
– నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా
– వికారాబాద్‌ జిల్లా న్యాయస్థానం తీర్పు
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా.. మళ్లీ తన భార్య ఆడపిల్లనే కంటుందేమో అని అనుమానంతో కట్టుకున్న భర్తే దారుణ హత్యకు పాల్పడ్డాడు. తొమ్మిదేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడికి వికారాబాద్ జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఈ విషయాన్ని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పెద్దేముల్ పోలీస్టేషన్ పరిధి బండపల్లి గ్రామానికి చెందిన గుండె పల్లి రవి భార్య ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మరోసారి గర్భం దాల్చగా 2016 జనవరి నాటికి 8నెలల గర్భిణీగా ఉంది. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని రవి తన భార్యను శారీరకంగా, మానసికంగా వేదింపులకు గురిచేసే వాడు. మళ్ళీ ఆడ పిల్లనే కంటుందేమో అని రవి తన అమ్మ మాటలు విని అనుమానం పెంచుకున్నాడు. తన భార్యను ఎలాగైనా హతమార్చాలి అనే ఉద్దేశంతో అదే సంవత్సరం జనవరి 3వ తేదీన భార్యను అతి కిరాతకంగా గొడ్డలితో హత్య చేశాడు.

అప్పట్లో తాండూరు రూరల్ సీఐగా ఉన్న సైదిరెడ్డి, పెద్దేముల్ ఎస్ఐ కృష్ణలు నిందితుడిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన వికారాబాద్‌ జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి డా. ఎస్. శ్రీనివాస్ రెడ్డి నిందితునికి జీవిత ఖైదుతో పాటు రూ. 5,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వెల్లడించారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే, నిందితుడు అదనంగా ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష అనుభవించవలసి ఉంటుందని తీర్పులో పేర్కొన్నట్లు వివరించారు.

ఈ కేసు దర్యాప్తులో పాలుపంచుకున్న అధికారులు, ఈ ప్రక్రియలో సహకరించిన ఇతర ముఖ్య అధికారులైన తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, అప్పటి రూరల్ సీఐ సైదిరెడ్డి, అప్పటి ఎస్ఐ కృష్ణ, ప్రస్తుత రూరల్ సీఐ ప్రవీణ్‌ కుమార్ రెడ్డి, ప్రస్తుత ఎస్ఐ శంకర్‌, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.సుధాకర్ రెడ్డి, సీడీఓ సాయిరామకృష్ణ, లైజన్ ఆఫీసర్లు ఎస్. శ్రీనివాస్(ఎస్ఐ), ఇ. చంద్ర శేఖర్ (ఏఎస్ఐ)లను అభినందించారు.

ఇదికూడా చదవండి…

పంచాయతి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి