పటేల్ ప్రవీణ్ మరణం తీరని లోటు

తాండూరు రాజకీయం వికారాబాద్

పటేల్ ప్రవీణ్ మరణం తీరని లోటు
– ఒక మంచి ధైర్యవంతుడిని కోల్పోయాం
– యువకులు వత్తిడికి లోను కావద్దు
– బతికి సాధించుకుందాం..క్షణికావేశం వద్దు
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు యువతకు ఆదర్శప్రాయుడు..వీరశైవ యువదళ్ నాయకుడు..బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక నేత పటేల్ ప్రవీణ్ మరణం పార్టీకి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఒక మంచి ధైర్యవంతుడిని కోల్పోయిందని అన్నారు. ప్రవీణ్ మరణంతో తాండూరు పట్టణంతో పాటు పెద్దేముల్ మండలాల్లో పార్టీకి తీరని నష్టం అని అన్నారు.

అత్యంత ధైర్యవంతుడు పటేల్ ప్రవీణ్ ఆత్మహత్యకు దిగడం చాలా బాధాకరం అని అన్నారు. ఇదే విషయంపై పటేల్ ప్రవీణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగిందని రోహిత్ రెడ్డి తెలిపారు. గత కొద్ది రోజులుగా పటేల్ ప్రవీణ్ తీవ్ర మానసిక వత్తిడిలో ఉన్నట్లు వారు తెలిపారని అన్నారు. అప్పు ఇచ్చిన వ్యక్తుల నుంచి తీవ్ర వత్తిడి వచ్చినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని అన్నారు. 10 శాతం వత్తిడికి అప్పులు ఇచ్చిన వ్యక్తులు తమ డబ్బును రాబట్టుకునేందుకు పటేల్ ప్రవీణ్ పై వత్తిడి తేవడం ప్రారంభించినట్లు కుటుంబ సభ్యులు వివరించినట్లు రోహిత్ రెడ్డి తెలిపారు.

మరోవైపు గత కొద్ది రోజులుగా ఒక కోర్టు కేసుకు సంబంధించి రాజకీయ పరంగా కూడా పటేల్ ప్రవీణ్ పై వత్తిడి కొనసాగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని వెల్లడించారు. నిత్యం ఫోన్లు చేయడం..కొందరు నేతలు ఇంటికి రావడం చేస్తున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని అన్నారు. కోర్టులో కేసును వెనక్కి తీసుకోవాలని రాజకీయ నేతలు వత్తిడి తీసుకువచ్చారని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఒకవైపు అప్పులు ఇచ్చిన వ్యక్తులు..మరోవైపు రాజకీయ నేతల వత్తిడితో మానసిక ఆందోళనకు గురైన పటేల్ ప్రవీణ్ ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు రోహిత్ రెడ్డి వెల్లడించారు. యువకులు వత్తిడికి లోను కావద్దు..బతికి సాధించుకోవాలని..క్షణికావేశం వద్దని రోహిత్ రెడ్డి సూచించారు. పటేల్ ప్రవీణ్ కుటుంబానికి పార్టీతో పాటు నేను అండగా ఉంటానని అన్నారు. చాలా కాలంగా పటేల్ ప్రవీణ్ మా కుటుంబంలో ఒకడిగా ఉంటూ వచ్చారని రోహిత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

ఇదికూడా చదవండి…

పటేల్ ప్రవీణ్‌ కన్నుమూత..!