కౌంటింగ్.. కిరికిరి..!
– ఎమ్మెల్యే రాకపై విరుచుకుపడిన పైలెట్
– ఎలా అనుమతిస్తారంటూ రోహిత్ రెడ్డి మండిపాటు
– ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర
– ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్న రోహిత్ రెడ్డి
– పోలీసులు, నేతల మద్య తోపులాట..ఉద్రిక్తత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కిరికిరి జరిగింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిబంధనలకు విరుద్దంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్లారని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మండిపడ్డారు. లోపలికి ఎలా వెళ్లారని రోహిత్ రెడ్డి ప్రశ్నించడంతో పోలీసులు, నేతలు మద్య తోపులాట జరిగింది.

శుక్రవారం తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్ వద్ద మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సాయంత్రం వేళ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆయన అనుచరులతో కేంద్రం వద్దకు వచ్చారు. అయితే పోలీసులు ఎమ్మెల్యేతో పాటు అనుచరులను లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎలా లోపలికి వెళ్లారని, 50 మందితో కేంద్రంలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఈక్రమంలో పోలీసులో రోహిత్ రెడ్డి మద్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో గేటు వద్ద ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో.. నేతలు, కార్యకర్తలు విరుచుపడడంతో కౌంటింగ్ కేంద్రం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.

ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే దౌర్జన్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్దంగా వస్తున్న ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకే ఎమ్మెల్యే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారని ఆరోపించారు. గుండాలతో వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారని, అధికారులు, పోలీసులు అనుకూలంగా వ్యవహరించారని అన్నారు. ఇంకా 5వార్డులకు సంబంధించిన ఫలితాలు రాకముందే లోపలికి చొరబడి.. ఫలితాలను తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను ఓర్వలేక పోతున్నారని అన్నారు. గెలిచారని విర్రవీగరాదని, ప్రజల ఆదరణ బీఆర్ఎస్ వైపే ఉందని అన్నారు. తాండూరులో ఎమ్మెల్యే చేస్తున్న దాదాగిరి రాజకీయాలకు బయపడేది లేదని అన్నారు. దౌర్జన్యాలను తప్పకుండా ఎదిరిస్తామని అన్నారు. తాండూరులో జరిగిన అరాచకంపై ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, విజయ్ కుమార్, మండలాల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.


