సంక్షేమానికే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక
– ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
– గ్రామాల్లో అభివృద్ధికి ఆగ్రస్థానం
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
– గౌతాపూర్‌లో 99రోజుల కార్యక్రమంపై అవగాహన
– టీచర్‌గా మారి లెక్కలు నేర్పిన కలెక్టర్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలు కార్యక్రమాన్ని చేపట్టిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.

బుధవారం గ్రామ పంచాయతీ – ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక లోభాగంగా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామ పంచాయతీ – ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికపై అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు గురించి సమగ్రంగా వివరించారు.

గ్రామాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. గ్రామ పరిశుభ్రత, తాగునీరు, వీధి దీపాలు మరియు ఇతర మౌలిక వసతుల పరిస్థితి పై ఆరా తీశారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కార చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగంగా మరియు పారదర్శకత తో చేయాలనీ అధికారులకు ఆదేశించారు. గ్రామ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలతో సమన్వయం కలిగి పని చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక అనుమతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేలా త్వరలో వెసులుబాటు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
టీచర్‌గా మారి లెక్కలు చెప్పిన కలెక్టర్
అనంతరం జిల్లా కలెక్టర్ దీపక్ తివారి గౌతాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మూడో తరగతి విద్యార్థులకు కలెక్టర్ కొద్దిసేపు పాఠాలు బోధించారు.

గణితంలో కూడికలు, తీసివేతలు భాగాహారాలపై విద్యార్థులను ప్రశ్నించారు. విద్యార్థులు చక్కగా సమాధానాలు చెప్పడంతోపాటు పాఠ్యాంశాలను సునాయాసంగా చదవడంపై కలెక్టర్ అభినందించారు. అనంతరం పాఠశాలలో వంటగదిని కూడా పరిశీలించారు. విద్యార్థులకు మెనుప్రకారం భోజనం అందించాలని సూచించారు. మరోవైపు చెంగోల్ గ్రామంలో పర్యటించి మురుగుకాలువలను పరిశీలించారు. పారిశుధ్ద్యం పనులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ కర్ర అనిత, జిల్లా విద్యాధికారి రేణుకా దేవి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, తహసీల్దార్ తారా సింగ్, ఎంపీడీఓ విశ్వ ప్రసాద్, సర్పంచ్ లు సృజన, నర్సమ్మ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


