అప్పుల వేధింపులకు మహిళ బలి..!
– పురుగుల మందుల తాగి ఆత్మహత్య
– తాండూరు మండలంలో ఘటన
– కేసు నమోదు చేసుకున్న పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అప్పులు ఇచ్చిన వారు వేధింపులకు గురిచేయడంతో పాటు అందరి ముందు అవమానించేలా ప్రవర్తించడంతో ఓ మహిళ మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.

పురుగుల మందు సేవించిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈసంఘటన తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామంలో జరిగింది. కరణ్ కోట్ పోలీసులు, బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన అగ్గనూర్ వీరప్ప, లక్ష్మీ దంపతులు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే 10నెలల క్రితం హనుమంత్ రెడ్డి వద్ద రూ. 1లక్ష అప్పుగా తీసుకున్నారు. పంటలు పండకపోవడంతో అప్పు తీర్చలేకపోయారు.

దీంతో హనుమంత్ రెడ్డి, అతని భార్యలు ఇంటికి వెళ్లి లక్ష్మీని అప్పు తీర్చాలని వేధింపులు చేశారు. అందరి ముందు అవమాన పరిచేలా దూషించారు. దీంతో అవమానాన్ని భరించలేక లక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంభీకులు చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. హన్మంత్ రెడ్డి, అతని భార్య చేసిన వేధింపుల వల్లే తన భార్య మృతి చెందిందని మృతురాలి భర్త వీరప్ప ఆరోపించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు కరణ్ కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ తెలిపారు.


