ఆసుప‌త్రిలో వెక్కిరిస్తున్న ఖాళీలు

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ఆసుప‌త్రిలో వెక్కిరిస్తున్న ఖాళీలు
– ఎంసీహెచ్‌లో వైద్య సిబ్బందిపై భారం
– గ‌ర్భిణీ, చిన్నారుల సేవ‌ల‌కు ఇబ్బందులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న‌ట్లుగా తాండూరు మాతా శిశ ఆసుప‌త్రి ప‌రిస్థితి మారింది. కోవిడ్ నేప‌థ్యంలో మాన‌వ‌త్వంతో ఎంతో మందికి కోవిడ్ గ‌ర్భిణీల‌కు ప్ర‌సూతి సేవ‌లు అందించి ఉత్త‌మ ప్ర‌శంస‌లు అందుకుంది. అయితే అంత‌కంటే భారంగా ఆసుప‌త్రిలోని ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దాదాపు రూ. 15 కోట్ల‌తో నిర్మించిన మాతాశిశు ఆసుప‌త్రి ఈ ఏడాది నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. రూ. 150 ప‌డ‌క‌ల‌తో ఉన్న ఈ ఆసుప‌త్రిలో ప్ర‌తిరోజూ 400 మంది బ‌య‌టి మ‌హిళ‌లు వైద్య సేవ‌లు పొందుతున్నారు. 120 మంది ఆసుప‌త్రిలో చేరుతున్నారు. నిత్యం 15 మందికి ప్ర‌సూతి సేవ‌లు అందుతున్నాయి. ఇందులో దాదాపు 10 సాధార‌ణ ప్ర‌స‌వాలు, 5 సీజ‌రీయ‌స్ ప్ర‌స‌వాలు అవుతున్నాయి. అయితే ఆసుప‌త్రిలో 66 మంది వైద్య సిబ్బంది అవ‌స‌రం ఉండ‌గా కేవ‌లం 18 మంది మాత్ర‌మే విధులు నిర్వ‌హిస్తూ సేవ‌ల‌ను అందిస్తున్నారు. మిగ‌తా పోస్టులు ఖాళీలుగా ఉండ‌డంతో విధులు నిర్వ‌హిస్తున్న వారిపైనే ప‌నిభారం ప‌డుతుంది. దీంతో రోగుల‌తో పాటు గ‌ర్భిణీ మ‌హిళ‌ల సేవ‌ల‌లో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని వైద్య సిబ్బంది వాపోతున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించి ఆసుప‌త్రిలో వైద్య పోస్టుల‌ను భ‌ర్తి చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. దీనిపై ఆసుప‌త్రి సూప‌రిండెంట్ స్పందిస్తూ ఖాళీల భ‌ర్తిపై ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంప‌డం జ‌రిగింద‌ని, ఈ నిర్ణ‌యం ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉంద‌ని తెలిపారు. మ‌రోసారి ప్ర‌తిపాద‌న‌లు పంపి పోస్టుల భ‌ర్తికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.