మైనర్ల డ్రైవింగ్‌పై జాగ్రత్త..!
– అవగాహన కల్పించే బాధ్యత అందరిది
– ఈవ్ టీజింగ్, సైబర్, మత్తుపై దూరంగా ఉంచాలి
– తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
– విద్యాసంస్థల ప్రతినిధులు, ప్రిన్సిపల్‌లకు కౌన్సిలింగ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మైనర్ల డ్రైవింగ్ పట్ల అందరు జాగ్రత్త వహించాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి అన్నారు. గురువారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో తాండూరు పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల ప్రిన్సిపల్, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయని.
రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంబవిస్తున్నాయన్నారు. కాలేజీ, స్కూళ్లలో ఎవరైనా విద్యార్థులు డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలిస్తే వారికి డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. వయస్సు నిండకుండా డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తారని హెచ్చరించాలన్నారు. మైనర్ల డ్రైవింగ్ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. బైకులపై, వాహనాలపై డ్రైవింగ్ చేస్తూ కాలేజీలకు రాకుండా చూడాలన్నారు.
అదేవిధంగా కాలేజీలలో ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలకు పాల్పడకుండా, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కల్పించాలన్నారు. అవగాహన కల్పించే బాధ్యత అందరిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్, వివిధ కాలేజీల ప్రిన్సిపల్ లు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

