1నుంచి 8 వరకే ఇంగ్లీష్ మీడీయం
– 2023-24లోనే 9,10 తరగతులకు అమలు
– వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఆంగ్లమాధ్యమం
దర్శిని డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మొదట 1 నుంచి 8వ తరగతి వరకే ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి పేర్కొన్నారు. శనివారం జరిగిన శాసన సభ సమావేశంలో జరిగిన జీరో అవర్‌లో మంత్రి సబితారెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 8న విద్యాయజ్ఞానికి శ్రీకారం చుట్టారని అన్నారు. మనఊరు-మనబడి కార్యక్రమం మొదటి దశలో భాగంగా మండలం యూనిట్‌గా అత్యధిక విద్యార్థులున్న 9,123 పాఠశాలలను ఎంపిక చేశామని, రెండో దశలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకొంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో 9వ తరగతి, 2024-25 నుంచి 10వ తరగతులకు ప్రారంభిస్తామని తెలిపారు. ఇంగ్లిష్ మీడియం బోధనపై ఈ నెల 14 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. అదేవిధంగా రూ.2 లక్షలు విరాళం ఇస్తే ఎస్‌ఎంసీ కమిటీలో సభ్యత్వం, రూ.10 లక్షలు ఇస్తే ఒక తరగతి గదికి, రూ.25 లక్షలు ఇస్తే ప్రాథమిక పాఠశాలకు, రూ.50 లక్షలు ఇస్తే ప్రాథమికోన్నత పాఠశాలకు, రూ.కోటి ఇస్తే ఉన్నత పాఠశాలకు దాతల పేర్లు లేదా వారు సూచించిన పేర్లు పెడతామని చెప్పారు. త్వరలోనే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేస్తామని, పాత విద్యాకమిటీలనే కొనసాగిస్తామని చెప్పారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ద్విభాషా పుస్తకాలను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకం బకాయీల చెల్లింపునకు చర్యలు తీసుకొంటున్నట్టు తెలిపారు.

