తొందరపాటు తగదు
– పిల్లలతో వెళ్లిన సత్యమూర్తి తిరిగి రండి
– అన్నపూర్ణ అదృశ్యంలో ముమ్మర విచారణ
– తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధిః అదృశ్యంలో కేసులో పురోగతి లేదంటూ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ అభిప్రాయ పడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు సత్యమూర్తి పిల్లలతో కలిసి అదృశ్యమైన సంఘటన శనివారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ స్పందించి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గత మూడు నెలల క్రితం మార్చి 6న సత్యమూర్తి భార్య అన్నపూర్ణ(36) అదృశ్యం కావడంతో కేసు నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి పోలీసు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టడం జరిగిందని తెలిపారు. కుటుంబీకులు, చుట్టాలు, స్నేహితులు, పరిచయస్థుల వ్యక్తుల నుండి సమాచారం తీసుకొని విచారణ చేపట్టడం జరిగిందని వివరించారు.
పలు ప్రాంతాలలో సీసీ పుటేజీలను కూడ పరిశీలించినట్లు చెప్పారు. అనుమానం వచ్చిన ఆంద్ర, తెలంగాణ, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలు శిరిడీ, బెంగళూర్ ,ఊటీ, తిరుపతి, నెల్లూరు, అనంతపూర్, కడప, కోడంగల్, మహబూబ్ నగర్, హైదరాబాద్, చించోళి, కుంచరం, సేడం, మిర్యాణ్ ప్రాంతాలలో పరిశోధనలు చేయడం జరిగిందని వివరించారు. విచారణ ఇంకా జరుగుతున్న సమయంలోనే సత్యమూర్తి గత రాత్రి బాధతో పిల్లలతో చేసిన వీడియో పోస్ట్ చేయడం, ఆ తరువాత కనిపించకుండా పోవడం జరిగిందన్నారు. ఇలాంటి సమయంలో సత్యమూర్తి తప్పుడు నిర్ణయంతో తొందర పాటు చర్య వల్ల అదృశ్యం కావడం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలీస్ పరిశోధన ఇంకా కొనసాగుతూనే ఉందని, కావున అన్నపూర్ణను ఇంకా గుర్తించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందుకోసం పిల్లలతో వెళ్లిపోయిన సత్యమూర్తి తిరిగి వచ్చి పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా కుటుంబీకులు, బందువులు, స్నేహితులు, పరిచయస్థులు ఎవరైనా కేసుపైన ఏమైనా ఆధారాలు గాని ఆచూకీ గాని తెలపాలన్నారు. దీనీ ఆధారంగా విచారణ మరింత ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు.



