థ్యాంకూ సీఎం కేసీఆర్ సార్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

థ్యాంకూ సీఎం కేసీఆర్ సార్..!
– తాండూరుకు జీవోల జారీ పట్ల కృతజ్ఞతలు
– సీఎం కేసీఆర్‌ను క‌లిసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మంగళవారం హైద‌రాబాద్‌లోని ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కలిశారు. తాండూరు అభివృద్ధికి సంబంధించి పలు కీలక పనులకు ప్రభుత్వం ఇటీవల జీవోలను జారీ చేసిన విషయం తెలిసిందే. పది రోజుల క్రితం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్భంగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను ప్రస్తావించారు. వెంటనే ఆమోదం తెలపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తాండూరుకు పారిశ్రామిక వాడ, పాతతాండూరు రైల్వే వంతెన, వ్యవసాయ మార్కెట్ యార్డుకు భూమి, ఆటోనగర్ కు తాండూరు పట్టణ శివారులో భూమిని కేటాయిస్తూ జీవోలు జారీ అయ్యాయి. జీవోల జారీపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తాండూరుకు సంబంధించిన మరికొన్ని అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్యమంత్రిని విన్నవించారు. ఈ పనులకు సంబంధించి ఒక వినతిపత్రంను కూడా ఎమ్మెల్యే అందించారు. ఎమ్మెల్యే సూచించిన అభివృద్ధి పనులపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. పది రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో రెండు మార్లు భేటీ కావడం గమనార్హం.