ముటేషన్ కాపీ ఇవ్వకుంటే చచ్చిపోతా..!

క్రైం తాండూరు వికారాబాద్

ముటేషన్ కాపీ ఇవ్వకుంటే చచ్చిపోతా..!
– అధికారుల వేధింపులు భరించలేను
– పెట్రోల్ డబ్బాతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
– తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆస్తి మార్పిడి చేసిన ముటేషన్ కాపీ ఇవ్వకుంటే చచ్చిపోతానంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని హంగామా చేశాడు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. కలకలం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధి ధన్‌గర్‌గల్లికి చెందిన బుచ్చమ్మకు కుమారులు, కూతుళ్లతో కలిసి 9 మంది సంతానం. కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో బుచ్చమ్మ కన్నుమూసింది. ధన్‌గర్‌ గల్లిలో లలితమ్మ పేరుపై ఉన్న ఇళ్లు(ఇంటి నెంబర్ 5 -3-6) ఆమె కూతురు అనిత పేరుపై మారిపోయింది. విషయం తెలుసుకున్న విద్యాసాగర్‌ ఇంటి ముటేషన్‌కు సంబంధించిన కాపీ ఇవ్వాలని మున్సిపల్‌ అధికారులకు వినతిపత్రం ద్వారా కోరారు. సంవత్సరాల నుంచి రేపు, మాపు అంటూ అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు. కొన్ని నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న విద్యాసాగర్‌ విసిగి మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్దకు పెట్రోల్‌ డబ్బా తీసుకుని వచ్చాడు. మున్సిపల్ కార్యాలయంలో పెట్రోల్ డబ్బా ఒంటిపై పోసుకుని చచ్చిపోతా అంటూ హంగామా సృష్టించాడు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌ మాట్లాడుతూ ముటేషన్ కాపీ ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారంటూ ఆవేధన వ్యక్తం చేశారు. కాపీ ఇవ్వాలంటే రూ. లక్ష ఇవ్వాలని మున్సిపల్ మేనేజర్ డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దాదాపు అరగంట పాటు విద్యాసాగర్ హల్ చల్ చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితునితో, అధికారులతో మాట్లాడారు. అధికారులు సమస్య పరిష్కరిస్తారని బాధితునికి వివరించి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే ముటేషన్ కోసం ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయాలని బాధితుడు చేసిన ఆరోపణలను మున్సిపల్ మేనేజర్ తెలిపారు. బాధితుడు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని తెలిపారు. మరోవైపు మున్సిపల్లో జరిగిన సంఘటనపై జేడీ నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు.