బాలికపై కుక్కదాడి
– స్థానికుల అప్రమత్తతో తప్పిన ప్రాణాపాయం
– పాత తాండూరులో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: చిన్నారులపై వీధి కుక్కలు దాడికి తెగబడుతున్నాయి. దాడిలో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో ఇంటి నుంచి బయటకు వచ్చిన ఓ బాలికపై కుక్క దాడికి దిగింది. స్థానికులు గమనించి కుక్కను తరిమేయడంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన సోమవారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో చోటు చేసుకుంది. పాత తాండూరులోని కర్బలా మైదాన్ ప్రాంతానికి చెందిన బాలిక మరియం భేగం(4) స్థానిక అంగన్ వాడిలో చదువుకుంటుంది. సోమవారం ఉదయం అంగన్ వాడి తెరిచి ఉందో లేదో అని చూసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఒంటిగా ఉన్న బాలికపై అక్కడే ఉన్న ఓ కుక్క దాడికి పాల్పడింది. బాలిక వీపు వెనుక భాగంలో కుక్క పంటిగాట్లు పడ్డాయి. బాలిక అరుపులు విన్న స్థానికులు కుక్కను తరిమికొట్టడంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలికను ఇంటికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులు, స్థానికులు మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడదను పరిష్కరించాలని, లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు.

