డిగ్రీ విద్యార్థులకు గుడ్‌ న్యూస్..!

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

డిగ్రీ విద్యార్థులకు గుడ్‌ న్యూస్..!
– చదువుతూనే రూ. 10 సంపాదించే అవకాశం
– 103 కాలేజీలలో స్కిల్‌ డెవలప్‌ మెంట్ కోర్సులు
– వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సర్కారు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇకపై విద్యార్థులు డిగ్రీ చదువుతూనే నెలకు రూ.10 వేలు సంపాదించే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని పలు కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కోర్సులను ప్రవేశపెట్టడం సహా నిర్వహణపై ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి.. ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ మహిళా వర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ ఈ దిశగా చేపట్టిన చొరవతో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సమావేశంలో సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ప్రతినిధి సుబ్బారావుతో రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. ఈ నెల 28న మరోమారు సమావేశమై, పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ను తయారుచేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 1,054 డిగ్రీ కాలేజీలుండగా, అత్యధిక అడ్మిషన్లున్న 103 కాలేజీల్లో ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందులో 37 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా, 66 ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 56 కాలేజీలు ఓయూ పరిధిలోనే ఉన్నాయి. సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ సహకారంతో ఈ కోర్సులను నిర్వహిస్తారు.

ఎలా అమలు చేస్తారంటే..
సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ద్వారా మొత్తం 13 రకాల స్కిల్‌డెవలప్‌మెంట్‌ కోర్సులు అందుబాటులో ఉండగా, రాష్ట్రంలో 10 రకాల కోర్సులను ప్రవేశపెడతారు. సంబంధిత సెక్టార్‌లోని పరిశ్రమలతో సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌, సంబంధిత కాలేజీలు పరస్పరం ఎంవోయూను కుదుర్చుకొంటాయి. ఇందుకు వర్సిటీలు చొరవ తీసుకుంటాయి. విద్యార్థులు మూడు రోజుల పాటు కాలేజీలో, మిగిలిన మూడు రోజులు పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. అంటే పరిశ్రమలో 15 రోజులు పనిచేస్తే నెలకు రూ.10 వేల వేతనం ఇస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత ప్లేస్‌మెంట్స్‌ కల్పిస్తారు. ఒక కాలేజీలో ఒక కోర్సుకే అనుమతినివ్వనుండగా, గరిష్ఠంగా 60 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకుంటారు. బీఏ విద్యార్థుల కోసం కంటెంట్‌ అండ్‌ క్రియేటివ్‌ రైటింగ్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోర్సులను నిర్వహిస్తారు. బీఎస్సీ విద్యార్థులకు ఫార్మా, యానిమేషన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోర్సులను నిర్వహిస్తారు. బీకాం, బీబీఏ విద్యార్థులకు రిటైలింగ్‌, ఈ కామర్స్‌ ఆపరేషన్స్‌, లాజిస్టిక్స్‌ కోర్సుల్లో ఏదైనా ఒకదానిని కాలేజీలో అనుమతిస్తారు.