తాండూరుకు తాకిన ఫోన్ ట్యాపింగ్..!
– ముగ్గురికి సిట్ నుంచి కాల్
– ఇద్దరు నేతలు, ఓ టీచర్‌కు ఫోన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారం వికారాబాద్ జిల్లా తాండూరుకు కూడా పాకింది. తాండూరుకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఇద్దరికి, ఓ టీచర్‌కు ఫోన్ కాల్ వచ్చినట్లు ప్రచారం హల్ చల్ చేస్తోంది.

ఇటీవలే ఫోన్ ట్యాపింగ్ కేసులో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్‌రెడ్డిని ప్రత్యేక విచారణ బృందం (సిట్) విచారించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాండూరుకు చెందిన నేతలకు కూడా సిట్ పిలుపు వచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు చెందిన ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు దుమారం రేగింది. తాండూరు నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళతారని అనుమానం ఉన్న వారి ఫోన్లను, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నేతలకు టచ్‌లో ఉన్న వారి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రచారం ఉంది.

దీనిపై ప్రత్యేక విచారణ బృందం విచారణ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాండూరుకు చెందిన నేతలకు సిట్ ఫోన్ చేసినట్లు తెలిసింది. అయితే తాండూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీలో సీనీయర్ నేత డా.సంపత్ కుమార్‌కు సిట్ నుంచి ఫోన్ చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి ఎవరనేది తెలియరాలేదు. టీచర్ కు సంబంధించిన వివరాలను గురించి నిఘా బృందం ఆరా తీస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు విచారణకు హాజరవుతారు అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

ఇదికూడ చదవండి…

