జిల్లా కలెక్టర్ వద్దకు స్మశాన వాటిక పంచాయతీ
– సమాధుల కూల్చివేత, కబ్జాలపై ఫిర్యాదు
– భూమిపై రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పాత తాండూరులోని ఎస్సీ స్మశాన వాటిక పంచాయతీ జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది. బుధవారం తాండూరు దళిత ఎస్సీ వెల్పేర్ సోసైటీ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

స్మశాన వాటిక స్థలానికి రక్షణ కరువైందని, రియల్ వ్యాపారుల ఆక్రమణలతో సమాధులు సైతం కూల్చివేశారని తాండూరు దళిత ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ నాయకులు ఆరోపించారు. పట్టణంలోని సర్వే నంబర్–3లో ఉన్న స్మశాన వాటిక స్థలం అన్యాక్రాంతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

తాండూరు పట్టణంలోని సర్వే నంబర్–3లో సుమారు 19 గుంటల శిఖం భూమి ఉందని, ఈ స్థలంపై కొందరు రియల్ వ్యాపారులు కన్నేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఇప్పటికే అక్కడి సమాధులను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై గతంలో స్థానిక నేతలు, కౌన్సిలర్లు తాండూరు తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు.

దీంతో తాజాగా జిల్లా అదనపు కలెక్టర్ను కలిసి మరోసారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సర్వే నంబర్–3లోని స్మశాన వాటిక శిఖం భూమిని నిషేధిత జాబితాలో చేర్చి, ఆక్రమణలకు అవకాశం లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జుంటుపల్లి వెంకట్, దివిటి ఎల్లప్ప, దళిత సంఘాల నాయకులు డప్పు అంజిలయ్య, జుంటుపల్లి సుధాకర్, దామర్చేడ్ శ్రీకాంత్, ఎం.గోపాల్, శ్రీనివాస్, సురేష్, నాగేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


