ఆలస్యంగా ఇంట‌ర్ విద్యాసంవ‌త్స‌రం

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఆలస్యంగా ఇంట‌ర్ విద్యాసంవ‌త్స‌రం
– జూన్ 15 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు
– జులై 1 నుంచి ఫ‌స్ట్ ఇయర్ తరగతులు

– మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు
– ఇంటర్ అకడమిక్ షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇంట‌ర్ బోర్డు ఇంటర్మీడియట్ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం ఆల‌స్యంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ని ప్ర‌క‌టించింది. జూన్ 15 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకు తరగతులు ప్రారంభం అవుతాయ‌ని, జులై 1 నుంచి ఇంటర్ ఫస్ట్ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతాయ‌ని తెలిపింది. ప్రతీ ఏడాది జూన్ 1 నుంచే ఇంటర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యేవి. కానీ గత జేఈఈ మెయిన్ షెడ్యూల్ కారణంగా ఇంటర్ పరీక్షల తేదీలు మారడంతో జూన్ విద్యా సంవత్సరం 14 రోజులు ఆలస్యంగా ప్రారంభం కాబోతోంది. అకడామిక్ క్యాలెండ‌ర్‌లో అక్టోబర్ 2 నుంచి 9 వరకు దసరా సెలవులు ఇచ్చారు. వచ్చే ఏడాది 2023 జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక వార్షిక పరీక్షలను మాత్రం మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు మే చివరి వారంలో ఉంటాయని పేర్కొంది. 2023-24 విద్యా సంవత్సరానికి తిరిగి కళాశాలలు జూన్ 1 నుంచి ప్రారంభం అవుతాయ‌ని చెప్పింది.