ఎమ్మెల్సీది ఇంత న‌మ్మ‌క ద్రోహమా..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్సీది ఇంత న‌మ్మ‌క ద్రోహమా..!
– ఆయ‌న మాట‌తోనే కుర్చీ ఒప్పందం జ‌రిగింది
– ఇప్పుడు ఫోన్ చేస్తే స్పందించ‌డం లేదు
– రెండు రోజుల్లో చైర్ పర్సన్ ను కుర్చీ దించాలి
– లేదంటే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వు
– మీడియాతో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డ‌కుండా.. త‌ప్పించుకుంటూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి సొంత పార్టీ నేత‌ల‌కే న‌మ్మ‌క ద్రోహానికి పాల్ప‌డుతున్నార‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విమ‌ర్శించారు. గ‌త మూడురోజులుగా తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ పీఠం వ్య‌వ‌హారంలో ఆస‌క్తికర రాజ‌కీయాలు చోటుచేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీడియాతో సమావేశమై మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సమయంలో చైర్ పర్సన్ పదవి విష‌యంలో స్వప్న పరిమళ్, పట్లోళ్ల దీపా నర్సింలు మద్య ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డినే రెండున్నర సంవత్సరాల ఒప్పందం తీసుకవచ్చారన్నారు. పెద్ద మనిషి హోదాలో ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాటను గౌరవించి మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ రావు సమక్షంలో తమ ఇరువర్గాల మద్యం లిఖిత పూర్వక ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తుచేశారు. ఈ లెక్కన మొన్నటి వరకు గడువు తీరుతుందని ఎమ్మెల్సీకి ఫోన్ చేసి మాట్లాడితే సానుకూలంగా స్పందించారని తెలిపారు. మ‌రోసారి గడువు తీరిందని ఫోన్ చేస్తే ఎమ్మెల్సీ స్పందించడం లేదంటూ ఆరోపించారు. ఎమ్మెల్సీ కావాలనే చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ను కుర్చీ దించడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ అండతోనే చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆమె భర్త కుండ బద్దలుకొట్టినట్లు కుర్చీ దిగేది లేదంటూ పేర్కొంటుంటే ఎందుకు ఖండించడం లేదంటూ ప్రశ్నించారు. ఆరొ రోజు రెండున్నరేళ్ల ఒప్పందం చేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రస్తుతం ఇచ్చిన మాటకు కట్టుబడకుండా పార్టీకి నమ్మకద్రోహం చేస్తున్నారని విమర్శించారు.

రెండు రోజుల గడువు
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ను రెండు రోజుల్లో కుర్చీ దించాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గడువు ప్రకటించారు. చైర్ పర్సన్ ను కుర్చీ దించేందుకు ఎంతవరకైనా వెళతామని, చైర్ పర్సన్‌గా పట్లోళ్ల దీపా నర్సింలును కుర్చీపై ఎక్కిస్తామని సవాల్ చేశారు. పెద్దరికంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. మన మద్య ఏమైనా ఉంటే సపరేట్‌గా చూసుకుందామని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కవ్వించారు.

స్వయంగా ఎమ్మెల్సీకి ఫోన్ చేసిన ఎమ్మెల్యే

మరోవైపు రెండున్నర ఏళ్ల ఒప్పందంపై మాట్లాడేందుకు ఎమ్మెల్సీకి పోన్ చేస్తే స్పందించడం లేదని విషయాన్ని మంత్రి సబితా రెడ్డి, మంత్రి శ్రీనివాస్ యాదవ్ల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. మంత్రులు ఫోన్ చేసినా కూడ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందించలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండడంతో, మంత్రి కె టీఆర్ కాలుకు ఫ్యాక్చర్ వల్ల విశ్రాంతిలో ఉండడంతో ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడంలో జాప్యం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సందుల లత, ఎర్రం వసంత, భీంసింగ్, అస్లాం, అసిఫ్, సిందూజ గౌడ్, సంగీత ఠాకూర్, అశ్విని గుండప్ప, కోఆప్షన్ సభ్యురాలు సారంగా విజయ్, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.