చావ‌డానికి చెట్టెక్కి..!

క్రైం తెలంగాణ వికారాబాద్

చావ‌డానికి చెట్టెక్కి..!
– కింద‌కు దిగుతూ జారిప‌డి గాయాలు
– వికారాబాద్‌లో హంగామా చేసిన యువ‌కుడు
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఏదో విష‌యంలో మ‌న‌స్థాపం చెందిన ఓ యువ‌కుడు చావ‌డానికి చెట్టెక్కాడు. అక్క‌డి నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని అంద‌రిని బెధిరిస్తూ హంగామా సృష్టించాడు. పోలీసులు, స్థానికులు న‌చ్చ‌జెప్ప‌డంతో కింద‌కు దిగే ప్ర‌య‌త్నంలో ప్ర‌మాద వ‌శాత్తు జారీ ప‌డిపోయాడు. దీంతో కాలు విరిగి ఆసుప‌త్రి పాల‌య్యాడు. ఈ సంఘ‌ట‌న శ‌నివారం వికారాబాద్ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే చ‌త్తీస్‌ఘ‌డ్ ప్రాంతానికి చెందిన రిషికేష్ అనే యువ‌కుడు శ‌నివారం వికారాబాద్ ప‌ట్ట‌ణం రైల్వే బ్రిడ్జీ పక్క‌న ఉన్న చెట్టుపైకి ఎక్కాడు. వెంట వాట‌ర్ బాటిల్ కూడ తీసుకెళ్లాడు. కాసేపు చెట్టుపైనే కూర్చుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని హ‌ల్ చ‌ల్ చేశారు. స్థానికులు విష‌యాన్ని పోలీసుల‌కు స‌మాచారం అందించారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కింద‌కు దిగాల‌ని సూచించారు.

దాదాపు 4 గంట‌ల పాటు యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని హంగామా సృష్టించాడు. ఎట్ట‌కేల‌కు శాంతించి కింద‌కు దిగేందుకు అంగీక‌రించాడు. ఇలా దిగే క్ర‌మంలో ప్ర‌మాద వ‌శాత్తు జారి కింద‌ప‌డిపోయాడు. స్థానికులు వెంట‌నే ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా రిషికేష్ కాలు విరిగినట్లు వైద్యులు నిర్దారించారు. అయితే కొంద‌రు త‌న‌పై బెధిరింపుల‌కు పాల్ప‌డినందుకు చెట్టు ఎక్కి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. చెట్టు ఎక్కి యువ‌కుడు చేసిన హంగామా వికారాబాద్‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.