దసరాకు పల్లె దవఖానలు

ఆరోగ్యం తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

దసరాకు పల్లె దవఖానలు
– రూ. 30 కోట్లతో తాండూరులో నర్సింగ్ కాలేజీ
– వైద్యులు, సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్
– ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
– తాండూరులో ఆశ, ఏఎన్ఎంలకు కొత్త చీరల పంపిణీ
– పాత తాండూరులో బస్తీ దవఖానా ప్రారంభం
– పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం
తాండూరు. దర్శిని ప్రతినిధి: వచ్చే దసరాకు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె దవఖానలను అందుబాటులోకి తీసుకరావడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మంత్రి హరీష్ రావు తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని ఎంసీహెచ్ ఆసుపత్రిలో రోగులు అటెండర్ల కోసం షెడ్డుకు స్థాపన, పాత తాండూరులో బస్తీ దవాఖానను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా రైతు బజార్లో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు పట్టణంలోని నేషనల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆశల సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు పాల్గొని ఆశ, ఏఎన్ఎంలకు కొత్త చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో అందరికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఆంధ్రాపాలనలో రూ. 2వేల వేతనం పొందిన ఆశ. ఏఎన్ఎంలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రగతిభవన్లో భోజనం పెట్టించి రూ. 9750లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా సీఎం కేసీఆర్ సహాకారంతో అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. ఆంధ్రపాలనలో ఒక్క డిగ్రీ కాలేజీ లేని ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఏర్పాటుతో మూడు జిల్లాలు ఏర్పడ్డాయన్నారు. కేసీఆర్ చొరవతో జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు అవుతున్నాయన్నారు. వికారాబాద్ జిల్లాలో రూ.250 కోట్లతో నిర్మించేందుకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. తాండూరుకు రావాల్సిన మెడికల్ కాలేజీ స్థానంలో ఎమ్మెల్సి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతామ హేందర్ రెడ్డిల విజ్ఞప్తి మేరకు నర్సింగ్ కాలేజీని మంజూరు చేయిస్తామన్నారు. రూ. 30 కోట్లతో నిర్మించే కాలేజీపై వారం రోజుల్లో ప్రకటన జారీ చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 బస్తీ దవఖానలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా పాత తాండూరులో బస్తీ దవఖాన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

దీంతో పాటు. రాష్ట్రంలో ఏఎన్ఎం వ్యవస్థను బలోపేతం చేసేందుకు దృష్టి సారించడం జరిగిందని, ఇందులో భాగంగా ఏఎస్ఎం సబ్ యూనిట్లను పల్లె దవఖానలుగా మారుస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే దసరా నాటికి 3200 పల్లె దవఖానలు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. ఇప్పటికే పల్లె దవాఖానలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. వికారాబాద్ జిల్లాలో కూడ నోటిఫికేషన్ విడుదలయ్యిందన్నారు. ఈ నెలాఖరులోగా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లాలో రూ. 15 కోట్లతో 50 పడకలతో ఆయూష్ ఆసుపత్రిని కూడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆశ, ఏఎస్ఎంలు ప్రజాఆరోగ్య రక్షకులుగా సేవలందించాలని మంత్రి హరీ ష్ రావు పేర్కొన్నారు. ప్రజల అనారోగ్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలన్నారు. త్వరలోనే ఏఎన్ఎంలను రెగ్యులర్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అంతకుముందు మంత్రి హరీష్ రావు తెలంగాణ కవి కాళోజీకి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి హరీష్ రావు ఆశ సర్కర్లతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాతా శిశు సంక్షేమ శాఖ అధికారి శ్వేతా మహంతి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.నిఖిల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం) త‌దిత‌రులు పాల్గొన్నారు.