గుండెను ప‌దిలంగా ఉంచుకుందాం

ఆరోగ్యం జాతీయం తెలంగాణ హైదరాబాద్

గుండెను ప‌దిలంగా ఉంచుకుందాం
– ఈ అల‌వాట్ల‌ను మానేస్తే ర‌క్ష‌ణ‌
– నేడు వ‌ర‌ల్డ్ హార్ట్ డే
ద‌ర్శిని డెస్క్ : ఆధునిక జీవ‌న శైలిలో అనారోగ్య కార‌ణాలు గుండెపై ప్ర‌భావం చూపిస్తున్నాయి. ఫ‌లితంగా పెద్ద‌ల‌తో పాటు చిన్న వ‌య‌స్సు వారు కూడ గుండెపోటుకు గురైన సంఘ‌ట‌నలు చూస్తూనే ఉన్నాం. సరైన సమయానికి తినకపోవడంతోపాటు, నిద్ర కూడా సరిగ్గా పోక‌పోవ‌డం వంటి కార‌ణాలతో గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఏ వయసు వారైనా గుండె జబ్బులతో బాధపడవచ్చు. గుండె జబ్బులకు కొన్ని ప్రమాద కారకాలు ఉన్నాయి, ముఖ్యంగా ఊబకాయం, అధిక రక్తపోటు ఇవి యువతలో వేగంగా పెరుగుతున్నాయి. చెడు జీవనశైలి అలవాట్లు గుండె జబ్బులకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అందుకే పెద్దవారికే గుండెపోటు వస్తుందన్న అపోహ ఇప్పుడు తొలగిపోయింది. విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, గుండె సంబంధిత వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే 2022 ని నిర్వహిస్తుంటారు.

గుండె జ‌బ్బుకు కార‌ణాలు ఇవే..
గుండె జబ్బులు కేవలం మూడు కారకాలపై ఆధారపడి ఉంటాయి.. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం. కాబట్టి ఈ మూలకాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించడం అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం స్థూలకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా యువతలో ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది యువకులు జంక్ ఫుడ్, అధిక నూనెతో చేసిన వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు. ఇది వారి ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించే అవకాశాలను పెంచుతోంది.

జాగ్ర‌త్త‌లు పాటిస్తే గుండె ప‌దిలం
ధూమపానం మానేయండి- ధూమపానం ఊపిరితిత్తులకు మాత్రమే కాదు, గుండెకు కూడా హానికరం. మీరు ధూమపానం చేసే వారైతే, ఈ అలవాటును మానుకోండి.

మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి- మీరు అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లేదా ఊబకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటే, నిపుణులైన వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే సమయానికి మందులు వేసుకోవాలి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి – మీ ఆహారంలో గుండె-ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే చేర్చండి. ఉదాహరణకు ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, పప్పులు, బీన్స్, గింజలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.