ఇండ్ల‌లో చోరీల‌పై జాగ్ర‌త్తంగా ఉండండి

క్రైం టెక్నాలజీ వికారాబాద్

ఇండ్ల‌లో చోరీల‌పై జాగ్ర‌త్తంగా ఉండండి
– ఊరెళితే చోరీలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించండి

– అనుమానం వ‌స్తే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వండి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ద‌స‌రా సెల‌వులు, పండ‌గ వేళ ప్ర‌జ‌లు తమ ఇండ్ల‌ను ఎలా ప‌డితే అలా వ‌దిలేసి వెళ్లొద్ద‌ని, ఊరేళితే.. ప‌క్కింటి వారితో పాటు అవ‌ర‌స‌ర‌మైతే పోలీసుల‌కు స‌మాచారం అందించి వెళ్లాల‌ని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. శ‌నివారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో మాట్లాడుతూ పండుగ సంద‌ర్భంగా సొంత ఊరు వెళ్లే వారు గాని, విహార యాత్రలకు వెళ్ళేవారు గాని కొన్ని ప్రాధమిక సూచనలు పాటించాల‌ని అన్నారు. దొంగల బారిలనుండి ఇంటిని, విలువైన వ‌స్తువులును కాపాడుకోవాలని అన్నారు. ప్ర‌జ‌లు నివ‌సించే తమ కాలనీలో, ఇండ్లలో సీసీ టీవీల‌ను ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. ఎవ‌రైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే.. అత్యవసరం అయితే వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయాలని చెప్పారు. అదేవిధంగా డ‌య‌ల్ 100కు కాల్ చేసి స‌మాచారం అందించాల‌న్నారు.
దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌కుండా ఈ కింది సూచ‌న‌లు పాటించాల‌ని సూచించారు.
– మీరు ఊరికి వెళ్ళే సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు, నగదు మరియు బంగారం ఆభరణాలు పెట్టకండి. వాటిని బ్యాంకు లాకర్లో లేదా భద్రంగా దాచుకోవడం మంచిది.
– బీరువా తాళం చెవులు బీరువా పైన కానీ, బీరువాలోని బట్టల క్రింద, ఇంట్లో పెట్టి వెళ్లవద్దు.
– వాహనాలను ఇంటి వద్దనే పార్క్ చేసి తాళం చెవులు వెంట తీసుకుని వెళ్తే మంచిది.
– ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి బయట గొళ్ళెం పెట్టకండి.
– ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు, తాళం కనపడకుండా కర్టెన్స్ వేయాలి.
– ఈ బయట గేటుకు లోపల నుంచి తాళం వేయండి.
– బయటకు వెళ్ళేపుడు ఇంట్లో మరియు బయట లైట్ వేసి ఉంచండి.
– పేపర్ బాయ్, పాలు వేసే వాళ్లకు రావద్దని చెప్పండి.
– నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే నియమించుకోండి.
– మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి.
– ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి పక్క వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉండాలి.
– కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది, భద్రత ఎక్కువగా ఉంటుంది.
– మీ ఇంటికి సీసీ కెమెరాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని DVRని రహస్య ప్రదేశాలలో భద్రపర్చుకోవాలి. మొబైల్ యాప్ ద్వారా సీసీకెమెరా దృశ్యాలు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం ఉంటుంది.
– మీ వెంట విలువైన వస్తువులను తీసుకుని వెళుతున్నట్లయితే అట్టి బ్యాగును మీ దగ్గరే జాగ్రత్తగా అంటి పెట్టుకుని ఉంచుకోవలెను.
– మీరు బయటికి వెళ్ళే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయకండి.