మీ సెల్ పోయిందా..

క్రైం జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

మీ సెల్ పోయిందా..
– అయితే ఈ జాగ్ర‌త్త‌లు మీకోస‌మే
– దుర్వినియోగం నుంచి ఉప‌శ‌మ‌నం
ద‌ర్శిని డెస్క్ : ఇప్పుడు అంద‌రి చేతిలో సెల్ ఫోన్ కామ‌న్ అయిపోయింది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారు దాదాపు అన్ని అవ‌స‌రాల‌కు వినియోగిస్తుంటారు. కేవలం ఫోన్ కాల్స్ కోసమే కాకుండా.. ఆర్ధిక లావాదేవీలతో పాటు ఇంటి నుంచే ప‌నులు చేయించుకునే యాప్‌ల‌ను వినియోగిస్తున్నారు. అంత‌టి అవ‌స‌రాల‌ను తీరుస్తున్న ఫోన్లు నిర్లక్ష్యం.. అజాగ్ర‌త్త వ‌ల్ల పొగొట్టు కోవ‌డమో.. ఎవ‌రైనా దొంగ‌లించ‌డం వంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. దీంతో ఫోన్‌లో కాల్ డాటాతో పాటు అందులోని యాప్‌ల వ‌ల్ల జ‌ర‌గ‌రాని న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంద‌రిలో ఆందోళ‌న మొదల‌వుతోంది. అలాంటి ముప్పును త‌ప్పించుకోవాలంటే కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ఈ ముఖ్యమైన జాగ్ర‌త్త‌లు మీకోస‌మే.

సిమ్‌కార్డు బ్లాక్:
మీ మొబైల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా/ దొంగలించబడినా మొదటిగా కస్టమర్ కేర్ సిబ్బందికి ఫోన్ చేసి.. సిమ్‌కార్డును బ్లాక్ చేయండి. ఆ తర్వాత మొబైల్ పోయినట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. తద్వారా మీరు కొలాట్రల్ డ్యామేజ్ తగ్గించవచ్చు.

ఫోన్ బ్లాక్:
మీ మొబైల్ ఫోన్ చోరీకి గురైన వెంటనే.. సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ మొబైల్ ఫోన్‌కు సంబంధించిన వివరాలను.. i.e., కొనుగోలు చేసిన బిల్ కాపీ, కంప్లయింట్ నెంబర్ లాంటివి నమోదు చేసి.. ఆ వెబ్‌సైట్‌లో మీ మొబైల్‌ను బ్లాక్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టండి.

ఫోన్‌లోని డేటా డిలీట్ చేయండి:
ప్రతీ ఒక్కరూ తమ మొబైల్ ఫోన్‌లోని వివరాలను ఓ గూగుల్ అకౌంట్‌లో భద్రపరుచుకుంటారు. ఇక మీ మొబైల్ ఫోన్ దొంగలించబడిన వెంటనే.. మీరు www.google.com/android/find లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్‌లోకి లాగిన్ కాగానే మీ ఫోన్‌ సమాచారం వచ్చేస్తుంది. ఇక అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా మీరు ఫోన్‌లోని డేటా డిలీట్ చేయవచ్చు. కాగా, మొబైల్ పోయిన/ దొంగలించిన వెంటనే ఈ 3 పనులు చేయడం ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్ దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు.