దొరికితే వదిలేది లే..!

క్రైం తాండూరు వికారాబాద్

దొరికితే వదిలేది లే..!
– బైకుల భరతం పడుతున్న పోలీసులు
– నెంబర్‌ ప్లేట్స్, రిజిస్ట్రేషన్‌ లేకుంటే చర్యలు
– తాండూరులో 110 బైకుల సీజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: మీ బైకుకు నెంబర్ ప్లేట్ లేదా..? రిజిస్ట్రేషన్ కాకుండా రోడ్లపై తిరుగుతున్నారా..? జాగ్రత్త.. అంటూ తాండూరు పోలీసులు హెచ్చరిస్తున్నారు. గత కొంత కాలంగా చేయి తిరిగిన దొంగలు బైకులను ఎత్తుకెళ్లి నెంబర్ ప్లేట్స్‌ లేకుండా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటన యాలాల మండలంలో గత కొన్ని రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. నిబంధనలు పాటించకుండా నడిపించే బైకుల భరతం పట్టేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం పట్టణ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. మొన్న పట్టణంలోని విలియమూన్ చౌరస్తా, శివాజీ చౌరస్తాలో తనిఖీలు చేపట్టి నెంబర్ ప్లేట్స్‌, రిజిస్ట్రేషన్‌ లేని 65 బైకులను సీజ్ చేశారు. తాజాగా శనివారం తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో మళ్లీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ ప్లెట్స్, రిజిస్ట్రేషన్ లేని బైకులను తనిఖీలు చేశారు. తనిఖీలో బైకులు భారీగా పట్టుబడ్డాయి. నెంబర్ ప్లెట్స్‌, రిజిస్ట్రేషన్ లేని మొత్తం 110 బైకులను సీజ్ చేశారు. నిబంధనలు పాటించకుండా దొరికితే బైకులను వదిలేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాండూరులో చేపట్టిన వాహనాల తనిఖీలో పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

నెంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ తప్పనిసరి : సీఐ రాజేందర్ రెడ్డి
రోడ్డుపై నడిపే బైకులకు నెంబర్‌ ప్లేట్స్, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. వాహనదారులు అందరు నిబంధనలు పాటిస్తూ బైకులను నడిపించాలి. నెంబర్‌ ప్లేట్స్ లేకుండా రిజిస్ట్రేషన్‌ లేకుండా వేల కిలో మీటర్లు నడిపించడం నేరం. నిబంధనలకు వ్యతిరేకంగా బైకులను నడిపిస్తే సీజ్ చేస్తాం. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.